Free Electricity: తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ స్కీమ్ ప్రారంభం, వారికి మాత్రమే
Gruha Jyothi scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతినెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు రూ.500 కే ఎల్పీజీ సిలిండర్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Free Electricity in Telangana Gruha Jyothi scheme: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో మహాలక్ష్మి, గృహ జ్యోతి పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. గృహ జ్యోతి పథకం కింద ఇకనుంచి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారు. రేషన్‌కార్డు ఉన్నవారికి ఈ పథకం వర్తించనుంది. అయితే ప్రజా పాలన దరఖాస్తులలో అప్లై చేసుకున్న వారికి గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతినెలా రెండు వందల యూనిట్ల ఉచిత్ విద్యుత్ అందించనున్నారు. విద్యుత్ సిబ్బంది మీటర్ చెక్ చేసి 200 లోపు యూనిట్లు ఉన్న వారికి జీరో బిల్లు జనరేట్ చేసి కరెంట్ బిల్లును ఇవ్వనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల పథకాల ప్రారంభ వేదిక మార్చినట్లు వెల్లడించారు.
విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు ఈ పథకాన్ని వర్తింపచేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మీటర్ రీడింగ్ కు వెళ్లినప్పుడు దరఖాస్తుదారుల ఆధార్, తెల్లరేషన్ కార్డులను విద్యుత్ సిబ్బంది పరిశీలించనున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు మార్చిలో జీరో విద్యుత్ బిల్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఉచిత విద్యుత్ అందించే పథకం గృహ జ్యోతి
తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న అన్ని గృహాలకు ఉచిత విద్యుత్ అందించే ప్రభుత్వ పథకం గృహ జ్యోతి. ఈ పథకాన్ని 2023లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తాజాగా గృహ జ్యోతి పథకాన్ని అమలులోకి తెచ్చింది.
గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించే అన్ని ఇళ్లు ఉచిత విద్యుత్‌ను పొందేందుకు అర్హులు. ఇందులో గ్రిడ్‌కు అనుసంధానించబడిన గృహాలు, అలాగే లేనివి కూడా ఉన్నాయి.
గృహజ్యోతి పథకం తెలంగాణలోని 83 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు రూ.3,400 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు.
రూ.500కే గ్యాస్ సిలిండర్ - తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ
రాష్ట్రంలో అర్హులైన వారికి రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు మరో కీలక అడుగు పడింది. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకంపై ప్రభుత్వం మంగళవారం (ఫిబ్రవరి 27న) జీవో జారీ చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. అందులో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య దాదాపు 90 లక్షలు ఉంటుంది. డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు. గ్యాస్ కంపెనీలకు నెలవారీ సబ్సిడీ చెల్లిస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బులను గ్యాస్ కంపెనీలు బదిలీ చేయనున్నాయి. మూడేళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇస్తారు. ఈ పథకం అమలు నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.