Telangana News: తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్ల మెయింటెనెన్స్ మొత్తం ఇక వారికే - జీవో జారీ
Government Schools: అన్ని స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు చేపట్టడం, అమలు చేయడం లాంటివి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు చేయనున్నాయి.
Telangana Government Schools: తెలంగాణలో అన్ని గవర్నమెంట్ స్కూళ్ల నిర్వహణ (మెయింటెనెన్స్) బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా పాఠశాల స్థాయిల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయాలని ఆ జీవోలో పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సేవలను వాడుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను చేపట్టడం, వాటిని అమలు చేయడం, పర్యవేక్షించడం, సదుపాయాలను మెరుగుపర్చడం లాంటివి ఈ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు చేయనున్నాయి. ఇంకా గవర్నమెంట్ స్కూలు పిల్లలకు యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం వంటివి అందజేయడం లాంటి పనులను కూడా ఈ కమిటీలు పర్యవేక్షించనున్నాయి. గవర్నమెంట్ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులను చూసుకోవడం అంతా కూడా ఇకపై అమ్మ ఆదర్శ కమిటీలపైనే ఉండనుంది.
అమ్మ ఆదర్శ కమిటీల బాధ్యతలు ఇవీ
ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, బాలికల మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు కల్పించడం, చిన్న, పెద్ద మరమ్మతు పనులను చేపట్టడం, ఇప్పటికే ఉన్న, పనిచేయని టాయిలెట్ల పునరుద్ధరణ, నిర్వహణ, తరగతి గదుల విద్యుద్దీకరణ, స్కూలు ఆవరణలో పరిశుభ్రతగా ఉండేలా చూడడం, విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, స్కూలు భవనం మొత్తం నిర్వహణ, విద్యార్థులకు యూనిఫారాలు కుట్టించడం వంటివి ఉంటాయి.
అమ్మ ఆదర్శ పాటశాల కమిటీలు ప్రతి స్కూలు స్థాయిలో మహిళ ఎస్‌హెచ్‌జీ సభ్యుల నుంచి ఏర్పాటు చేస్తారు. గ్రామ సంస్థ లేదా ఏరియా స్థాయి సమాఖ్య ప్రెసిడెంట్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు స్కూలు హెడ్ మాస్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టే అన్ని కార్యక్రమాలను కో ఆర్డినేట్ చేస్తారు. ఇలా ఇకపై గవర్నమెంట్ స్కూల్స్ నిర్వహణ బాధ్యత మొత్తం మహిళ స్వయం సహాయక సంఘాలదే కానుంది.