Telangana Free Current: ఉచిత్ విద్యుత్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన, వచ్చే నెల నుంచి అమల్లోకి!
free current upto 200 units: తెలంగాణలో ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెల నుంచి రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు వారికి ఉచిత కరెంట్ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
Power bills up to 200 units a month: హైదరాబాద్: కరెంట్ బిల్లులపై రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (komatireddy venkatreddy) తెలిపారు. రెండు వందల యూనిట్లలోపు కరెంట్ బిల్లు వచ్చే వారికి ఫిబ్రవరి నెల నుంచి ఉచిత్ విద్యుత్ హామీ అమలులోకి వస్తుందని వెల్లడించారు. నగరంలోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మంగళవారం సమావేశమైంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సభ్యులు శ్రీధర్ బాబు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల అమలుపై చర్చించిన కమిటీ.. ఉచిత విద్యుత్ (Power bills up to 200 units) అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. గత ప్రభుత్వం కారణంగా లాభాల్లో ఉన్న రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి లాంటి ఎన్నో హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. లక్ష కోట్లను కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట నీళ్లపాలు చేశారని విమర్శించారు.
అంతకుముందు నేటి ఉదయం నల్లగొండ కలెక్టరేట్‌లో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని తాను వదులుకున్నానని, అలాంటి తనపై బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతోపాటు చత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న భయంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోపు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
గత కొన్ని రోజులుగా ఉచిత విద్యుత్ హామీ అమలుపై బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొత్త ఏర్పాటైన రోజు నుంచే ఎన్నికల హామీలను అమలు చేయాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు.. సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి కోమటిరెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. రైతు బంధు నిధుల విడుదల తక్షణమే జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన బీఆర్ఎస్ నేతలు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ హామీ ఏమైందని వీలు చిక్కినప్పుడల్లా నిలదీస్తున్నారు. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రాజెక్టులు, కరెంట్ పై విధివిధానాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత సాధ్యమైనంత త్వరగా ఉచిత విద్యుత్ ను అమలు చేసి అక్కాచెల్లెమ్మలకు ఆర్థిక భారం తొలగిస్తామని చెబుతూనే ఉన్నారు. ఒకవేళ సాధ్యమైనంత త్వరగా ఉచిత్ విద్యుత్ పై ప్రకటన చేయకపోతే, రాష్ట్రం నుంచి కరెంట్ బిల్లులను ఢిల్లీలోని సోనియా గాంధీ ఇంటికి పంపించే ఉద్యమాన్ని చేపడతామని కేటీఆర్ ట్వీట్లు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి రెండు వందల యూనిట్ల లోపు వారికి ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటన చేసింది.