How To Fill Praja Palana Applications: ప్రజాపాలన దరఖాస్తులు వచ్చేశాయ్.. ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి
Praja Palana Application: దరఖాస్తుతోపాటు.. ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ జతచేయాల్సి ఉంటుంది. పూర్తిగా నింపిన దరఖాస్తులను గ్రామసభల్లో అధికారులకు ఇచ్చి రశీదు పొందాల్సి ఉంటుంది.
Which Documents Needed For Praja Palana Application Filling : తెలంగాణ(Telangana)లో ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన(Praja Palana) దినోత్సవాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రజా పాలనలో ప్రజల సమస్యలను ప్రభుత్వం వింటుంది. అక్కడికక్కడే సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఇందుకోసం నేతలు, అధికార యంత్రాంగం గ్రామ సభలకు హాజరవుతారు. దీంతోపాటు.. ప్రజా పాలన పేరుతో ఏర్పాటు చేసే గ్రామ సభలు ఆరు గ్యారెంటీల(Six Guarantees)పై కూడా ఫోకస్ పెడతాయి. ఆరు గ్యారెంటీల అమలుకి సంబంధించి ప్రజా పాలన దరఖాస్తుల(Praja Palana Application)ను అధికారులు స్వీకరించడం గ్రామ సభల ముఖ్య ఉద్దేశం.
దరఖాస్తులు వచ్చేశాయి..
ప్రజాపరిపాలన కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకుంటారు. ఈ దరఖాస్తులను ప్రభుత్వం విడుదల చేసింది. ఖాళీ దరఖాస్తులను ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీలకు పంపించింది. వాటిని నింపి తిరిగి అధికారులకు అప్పగించాల్సి ఉంటుంగి. ఆయా ప్రాంతాల్లో గ్రామ సభలు జరిగినప్పుడు దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది.
అన్నిటికీ ఒకటే దరఖాస్తు..
ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. గ్యారెంటీల నెంబర్ 6 అయినా.. అందులో మళ్లీ వేర్వేరు హామీలున్నాయి. అయితే ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒకటే దరఖాస్తు ఫారాన్ని లబ్ధిదారులు నింపాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం పబ్లిక్ గవర్నెన్స్ అప్లికేషన్ పేరుతో దరఖాస్తు ఫారంలను సిద్ధం చేశారు అధికారులు. అందరికీ, అన్నిటికీ ఒకే దరఖాస్తు సిద్ధం చేశారు.
ఈ వివరాలు పూర్తి చేయాలి..
దరఖాస్తులో కుటుంబ వివరాలు పూరించాల్సి ఉంటుంది. కుటుంబ యజమాని పేరు, యజమాని పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నంబర్, వృత్తి, కులంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలను ఇందులో నింపాలి.
ఏయే పథకాలు కావాలి..?
మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేనేత పథకాలకు సంబంధించిన వివరాలను ఆ దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఏ పథకానికి దరఖాస్తు చేస్తుంటే.. ఆ పథకం పేరు కింద వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే ఆ పథకం పేరు ఎదురుగా ఉన్న చెక్ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. గ్యాస్ సబ్సిడీ కావాలనుకునేవారు.. ఆ పథకం పేరు ముందు టిక్ మార్క్ పెట్టి గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఏజెన్సీ పేరు, ఇప్పటి వరకు ఏడాదికి ఉపయోగిస్తున్న సగటు సిలిండర్ల సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది.
రైతు బంధు కోసం దరఖాస్తు చేస్తే.. కౌలు రైతు, లేదా యజమాని అనే కాలమ్ లలో టిక్ చేయాల్సి ఉంటుంది. రైతు కూలీలు తమ జాబ్ కార్డ్ నెంబర్ అక్కడ నమోదు చేయాలి. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు ఆ పథకం పేరు ముందు టిక్ మార్క్ ఉంచాలి. గృహజ్యోతి పథకం కింద విద్యుత్ రాయితీ పొందాలనుకునేవారు విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ దరఖాస్తులో నమోదు చేయాలి.
వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు.. వారికి కేటాయించిన చెక్ బాక్స్ లను నింపాల్సి ఉంటుంది. అమరవీరుల కుటుంబానికి చెందిన వారు కూడా ఇందులో వివరాలు నమోదు చేయాలి. అమరవీరుడు పేరు, చనిపోయిన సంవత్సరం, ఎఫ్‌ఐఆర్ నెంబర్, మరణ ధ్రువీకరణ పత్రం నెంబర్ నింపాలి. ఉద్యమకారుల విషయంలో సంబంధిత ఎఫ్‌ఐఆర్ నెంబర్, జైలుకు వెళ్లిన వివరాలు నింపాల్సి ఉంటుంది.
జతచేయాల్సిన డాక్యుమెంట్లు..
దరఖాస్తుతోపాటు.. ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ జతచేయాల్సి ఉంటుంది. పూర్తిగా నింపిన దరఖాస్తులను గ్రామసభల్లో అధికారులకు ఇచ్చి రశీదు పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులన్నిటినీ స్క్రూటినీ చేసి ఎవరెవరు, ఏ పథకానికి అర్హులో తేలుస్తారు. ఆ లిస్ట్ ప్రకారం సహాయం అందిస్తారు. ప్రజా పాలన దినోత్సవాల రోజు గ్రామాల్లో సందడి నెలకొంటుంది. దరఖాస్తుదారులంతా పథకాలకోసం గ్రామ సభల ముందు క్యూకట్టే అవకాశముంది.