Harish Rao : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో మహిళలకు న్యూట్రిషన్ కిట్స్ - తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో మహిళలకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.
Harish Rao : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ జరగనుంది. వైద్యారోగ్య శాఖ రోజు నుండి ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. పీ హెచ్ సిలు, సబ్ సెంటర్ల నిర్మాణ, మరమ్మతు పనులు వేగవంతం చేయాలన్నారు. సిద్ధమైన బస్తీ, పల్లె దవాఖానలు వెంటనే ప్రారంభించాలన్నారు.జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారుతో వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఈ వివరాలు తెలిపారు. 80 రోజుల్లో కంటి వెలుగు ద్వారా కోటి 50 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహణ గొప్ప విషయం, అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తం చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. 21 రోజుల ఉత్సవాల్లో భాగంగా వైద్యారోగ్య శాఖకు కేటాయించిన రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. 2023-24 లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6.84 లక్షల మహిళలు లబ్ధి పొందుతారనీ, 14-26 వారాల సమయంలో రెండో ANC సమయంలో, 27-34 వారాల సమయంలో మూడో ANC సమయంలో మొత్తం రెండు సార్లు కిట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 24 జిల్లాలో 111 కేంద్రాల్లో కిట్ల పంపిణీ ఉంటుందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
లబ్ధిదారుల సంఖ్యకు సరిపడా కిట్లు ఉండేలా చూడాలన్నారు. కిట్ల నిల్వ సురక్షితంగా ఉండేలా చూడాలన్నారు. కిట్లు పొందేందుకు వచ్చే గర్భిణులు ఇబ్బంది పడకుండా ఉండేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. ఇప్పటికే ప్రారంబించిన కేసీఆర్ కిట్లు ఒక అద్భుత పథకం అని, దీని వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గిందన్నారు. మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచామని, ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు గాను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ పథకానికి రూపకల్పన చేశారనీ మంత్రి అన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ కిట్ సూపర్ హిట్ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. నాలుగు ఏఎన్‌సీ చెకప్స్, కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు వంటివి రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు దోహదం చేస్తున్నాయన్నారు. జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు.