(Source: ECI/ABP News/ABP Majha)
Telangana News: తెలంగాణలో రైల్వేకు రూ.5 వేల కోట్లు, ఏపీకి కూడా భారీగానే - రైల్వే మంత్రి వెల్లడి
Minister Ashwini Vaishnaw: తెలంగాణ, ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు ఈసారి బడ్జెట్లో భారీగా కేటాయించామని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. యూపీఏ హాయాంతో పోల్చితే 10 రెట్లు ఎక్కువే అని చెప్పారు.
Railway Projects in Telangana and Andhra Pradesh: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కీలక వివరాలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంటులో తెలిపారు. తెలంగాణకు మొత్తం రూ.5,336 కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో రూ.32,946 విలువైన ప్రాజెక్ట్స్ ఉన్నాయని వివరించారు. ‘‘వాటిలో 40 అమృత్ భారత్ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ పూర్తిగా 100% ఎలక్ట్రిఫైడ్ రైల్వే లైన్లు ఉన్న రాష్ట్రం. రికార్డ్ స్థాయిలో 437 అండర్ పాస్ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయింది. త్వరలో ప్రారంభిస్తాం.
అలాగే ఆంధ్రప్రదేశ్ కు రూ.9,151 కోట్లు కేటాయించాం. ఉమ్మడి రాష్ట్రంలో యూపీఏ హయాంతో పోల్చితే 10 రెట్లు ఎక్కువ కేటాయింపులు చేస్తున్నాం. ₹73,743 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. 73 స్టేషన్లు అమృత్ భారత్ స్కీమ్ లో ఉన్నాయి. 743 అండర్ పాస్ / ఫ్లై ఓవర్లు నిర్మాణం జరిగాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కి ఇచ్చిన భూమిలో నీరు నిలిచిపోతుందని తెలిసింది. వేరే భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాము. ఏపీ సీఎం వేరే స్థలం చూసి కేటాయిస్తామన్నారు. అమరావతి లైన్ ప్రాజెక్ట్ చాలా కీలకమైంది. దీన్ని ₹247 కోట్లతో నిర్మిస్తున్నాం. నది మీద బ్రిడ్జితో కలుపుకుని 56 కి.మీ ప్రాజెక్ట్ ఇది. విజయవాడ రైల్వే జంక్షన్ చాలా కీలకమైంది. మాస్టర్ ప్లాన్ రెడీ అయింది’’ అని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంటులో తెలిపారు.