Young Voters: తెలంగాణ ఎన్నికల్లో వారిదే కీలక పాత్ర- అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించేది వాళ్లే
Young Voters: తాజా ఓటర్ల జాబితా మేరకు రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు 8.11 లక్షల మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు మధ్య 5.32 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకున్నారు.
Young Voters: యువత.. దేశ నవ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేది వీరే. వారి ఆలోచనలు అందరికంటే మిన్నగా, స్పష్టంగా, ఆవేశంగా ఉంటాయి. పాలకులను ప్రశ్నించాలన్నా? వారితో పనులు చేయించాలన్నా ముందుండి నడిపించేది వారే! నమ్మిన వారిని అందలం ఎక్కిస్తారు. నమ్మని వారిని అధ:పాతాళానికి పడేస్తారు. పాలకులను ఎన్నుకునే విషయంలోను వారి ఆలోచనా ధోరణి ఇతరులతో పోలిస్తే ఎప్పుడూ ప్రత్యేకమే. అలాంటి ఓటర్లు తెలంగాణలో లక్షల్లో ఉన్నారు. వారు తొలిసారిగా ఓటు హక్కు నమోదు చేయించుకున్నారు.
తాజా ఓటర్ల జాబితా మేరకు రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు 8.11 లక్షల మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు మధ్య వీరిలో 66 శాతం మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. అంటే ఏకంగా 5.32 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకోవడం గమనార్హం. గతంలో అర్హత ఉన్న ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వచ్చేది. మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది.
ఈ తంతంగం అంతా ఎందుకు అనుకుని చాలా మంది అర్హులు ఓటు నమోదు చేసుకునే వారు కాదు. దీనికి తోడు ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాలు తక్కువగా ఉండేవి. ఎంతో మంది నిరక్షరాస్యులు ఓటు హక్కు పొంద లేకపోయారు. అయితే ఈసారి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఆలోచించింది. అర్హత ఉన్న వారు ఓటు హక్కు పొందే మార్గాలను ఓటర్ల దరికి చేర్చింది. ఇంటి వద్ద కూర్చుని సెల్‌ఫోన్లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి, ఓటు హక్కుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా సీ-విజిల్ మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. అంతే కాకుండా ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్‌లలో విస్తృత ప్రచారం కల్పించింది. ఓటు హక్కు ఎలా పొందాలో సూచించే వెబ్‌సైట్లతోపాటు యూట్యూబ్‌లోనూ తెలుగులో వివరించే వీడియోలుగా అందుబాటులోకి వచ్చాయి. ఈ అవకాశాలను చక్కగా వినియోగించుకున్న యువతీ, యువకులు పెద్ద ఎత్తున ఓటర్లుగా మారారు.
ఫలితాలను డిసైడ్ చేసేది వాళ్లే
గత ఎన్నికల్లో తెలంగాణలో 15 నియోజకవర్గాల్లో తక్కువ ఓట్ల మెజారిటీతో అభ్యర్థుల భవిత తారుమారైంది. వీటిలో ఎక్కువగా 3 వేల నుంచి 5 వేల ఓట్ల తేడా ఉన్నవే. ఈ సారి యువత భారీగా ఓట్లు నమోదు చేసుకోవడంతో ఆసక్తి ఏర్పడింది. కొత్తగా ఓటు వచ్చిన యువత ఎటువైపు మొగ్గుచూపుతుందో అనే చర్చ విస్తృతంగా నడుస్తోంది. కొన్నిచోట్ల గెలుపోటములను యువ ఓటర్లే శాసించే స్థాయిలో ఉన్నారు.
ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో యువ ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు. దాంతో రాజకీయ పార్టీలు కొత్త ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. యువజన సంఘాలను ఏర్పాటు చేసి, యూనివర్సిటీలు, ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మా కళాశాలలున్న ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభించాయి.
18-19 ఏళ్ల ఓటర్లు ఎంత మంది ఉన్నారంటే
రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. జనవరి 5 నాటికి 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 2,78,650 మంది ఉండగా అక్టోబర్ నాటికి ఆ సంఖ్య 8,11,640కి చేరింది. ఇందులో యువతులు 3,45,471 మంది ఉండగా యువకులు 4,66,067 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ ఓట్లు 102 ఉన్నాయి.