Voting Invitation Card: 'శుభ ముహూర్తాన ఓట్లు వేసి గెలిపించండి' - ఓట్ల పండుగకు ఆహ్వానిస్తూ వినూత్న ప్రచారం
Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. వరంగల్ కు చెందిన ఓ కార్పొరేటర్ పెళ్లి పత్రిక మాదిరిగానే ఓటు ఆహ్వాన పత్రికను రూపొందించగా వైరల్ అవుతోంది.
Special Voting Invitation Card in Telangana: ఓటు.. ఐదేళ్లకోసారి సామాన్యునికి దక్కే ఓ గొప్ప ఆయుధం, అవకాశం. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ప్రజా ప్రతినిధులకు ఓటర్లే దేవుళ్లు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు నామినేషన్ వేసిన దగ్గర నుంచీ ప్రచారం ముగిసే వరకూ ముమ్మర ప్రయత్నాలు చేస్తారు. అటు ఓటర్లు, ఇటు లీడర్లు ఇద్దరూ పోలింగ్ ను పండుగలానే భావిస్తారు. తెలంగాణలో (Telangana) మరో 4 రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ నెల 28న ప్రచారం ముగియనుంది. ఈలోపు ఓటర్లను తమ వైపు ఆకట్టుకునేలా నేతలు వినూత్న ప్రచారంతో దూసుకెళ్తున్నారు. కొందరు ఓటర్లకు సేవ చేస్తూ వెళ్తుంటే, మరికొందరు తమ ప్రసంగంతో ఆకట్టుకుంటున్నారు. ఆయా పార్టీల నేతలు తమ మేనిఫెస్టోను వివరిస్తూ, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో, ఎలాంటి హామీలు నెరవేరుస్తామో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. పాటలు, ప్రకటనలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లతో ఓటర్లను తమవైపు తిప్పుకొనేలా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రచారంలో భాగంగా వరంగల్ కు చెందిన ఓ కార్పోరేటర్ (Corporator) వినూత్నంగా ఓటర్ల ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తూనే, తమ నేతకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అచ్చం పెళ్లికి ముద్రించినట్లుగానే ఓ ఆహ్వాన పత్రిక మాదిరిగా కరపత్రాన్ని ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 'ఓటు హక్కు వినియోగ ఆహ్వాన శుభ పత్రిక' నెట్టింట వైరల్ గా మారింది.
'అందరికీ ఇదే ఆహ్వానం'
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను గెలిపించాలని కోరుతూ, ఆయన తరఫున 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన నవీన్ వినూత్నంగా ఈ కరపత్రికను ముద్రించారు. అందరిలా కాకుండా, పెళ్లి పత్రిక మాదిరిగా కరపత్రాన్ని ముద్రించి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ, తమ నేతను గెలిపించాలని కోరారు. 'ఈ నెల 30న గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓట్ల పండుగ జరగనుంది. ఈ శుభ ముహూర్తాన వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ ను గెలిపించాలి.' అని అభ్యర్థించారు. ఈ ఆహ్వాన పత్రిక వైరల్ అవుతుండగా, అందరినీ ఆకట్టుకుంటోంది. బీఆర్ఎస్ సంక్షేమ పథకాల గురించి అందులో వివరించారు.
కాగా, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేంద్ర బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ పోటీలో నిలిచారు. బీజేపీ తరఫున ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ చేస్తున్నారు. అయితే, 2014లో టీఆర్ఎస్ తరఫున కొండా సురేఖ బరిలో నిలిచారు. 2018లో ఆమె కాంగ్రెస్ నుంచి పోటీలో నిలవగా, నన్నపునేని చేతిలోనే ఓటమిపాలయ్యారు. ఈ సారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ అటు నేతలు, ఇటు ప్రజల్లో నెలకొంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply