CM KCR Comments in Alampur: 'వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తాం' - ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు గెలవకూడదని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Telangana elections 2023: ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలవాలంటే ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటెయ్యాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఫ్యాక్షనిస్టులు, గూండాలు గెలవకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
CM KCR Slams Congress in Alampur Praja Ashirwada Sabha: ప్రజల చేతిలో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు అని ఎన్నికల సమయంలో విచక్షణతో ఆలోచించి ఓటెయ్యాలని సీఎం కేసీఆర్ (CM KCR) విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా అలంపూర్ (Alampur) లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు, గూండాలు గెలవకూడదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో పాలమూరు నుంచి అధికంగా వలసలు ఉండేవని, ప్రస్తుతం అక్కడ పరిస్థితులను ప్రజలు గుర్తించాలని చెప్పారు. పాలమూరులో కరువు రాకుండా చూసే బాధ్యత తనదని స్పష్టం చేశారు.
'ఎస్టీ జాబితాలోకి వాల్మీకి, బోయలు'
వాల్మీకి, బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని, మరోసారి అధికారంలోకి వస్తే వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆర్డీఎస్ నుంచి నీళ్లు తరలించుకు పోతున్నా అప్పుడు కాంగ్రెస్ నేతలు పదవుల మీద ఆశతో ఎవరూ మాట్లాడలేదని, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని విమర్శించారు. 'ఆర్డీఎస్ కాలువల్లో పూడికతీత పనులకు రూ.13 కోట్లు మంజూరు చేశాం. కాంగ్రెస్ హయాంలో ఉండే పింఛన్ రూ.2 వేలు చేశాం. మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్ రూ.5 వేలకు పెంచుతాం. 24 గంటల కరెంట్, రైతుబంధు రూ.16 వేలు అందిస్తాం.' అని వివరించారు.
కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు
తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. 'కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఏమైంది మన బతుకు.? దివంగత సీఎం ఎన్టీఆర్ పార్టీ రూ.2కు కిలో బియ్యం ఇచ్చే వరకూ ఆకలి బతుకులే కదా? ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులు. అంత ఎండి సచ్చినం. ఎవ్వడు ఆదుకున్నోడు లేడు. పేదల బాధలు పట్టించుకున్నోడు లేడు. పేదలకడుపు నింపాలన్న శ్రద్ధ ఎవరికీ లేదు. రైతుల పొలాలకు నీరిచ్చే బాధ్యత లేదు. ఏదీ చేయలేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి'
గత పదేళ్లలో అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపామని, ఇప్పుడు రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధు వేస్ట్ అంటూ మాట్లాడుతున్నారని, కరెంట్ కూడా 3 గంటల సరిపోతుందని అంటున్నారని, అది కావాలో? 24 గంటల కరెంట్ కావాలో.? తేల్చుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను ఆదుకుంటున్నామని, దళిత బిడ్డల కోసం దళిత బంధు, కంటి వెలుగు, ఆసరా పింఛన్ ఇలా అన్నింటినీ అందిస్తున్నామని వివరించారు. ఆడబిడ్డలు ప్రసవిస్తే అమ్మఒడి వాహనాల్లో వారిని ఇంటి వద్దే తీసుకెళ్లి దిగబెడుతున్నామని, ఇవన్నీ కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు.
Also Read: KTR News: నా చెల్లి చాలా డైనమిక్, ఆ ధైర్యం ఎవరికీ లేదు - కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు