Bandi Sanjay: వారు మసీదుకు వెళ్లి రాముడ్నే మొక్కుతారు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Telangana Election 2023: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో బండి సంజయ్ గురువారం (నవంబరు 16) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Bandi Sanjay counters KTR: ఎర్రవెల్లి ఫాంహౌస్లో కేసీఆర్ తాగి పడుకుంటారని, అలాంటి కేసీఆర్ ను అల్లాతో పోలుస్తారా? అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒక పాస్ పోర్టు బ్రోకర్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తిని అల్లాతో పోలుస్తారా? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాట్లపై బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నమాజ్ మైకులు బంద్ అయితాయని కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నారు. దీనికి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో బండి సంజయ్ గురువారం (నవంబరు 16) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రచారంలో భాగంగా మసీదుకు వెళ్లిన రాజకీయ నాయకులు టోపీలు పెట్టుకుని అల్లాను మొక్కడం లేదని వ్యాఖ్యలు చేశారు. కనీసం అల్లా గురించి ఆ నేతలకు తెలియదని, టోపీ పెట్టుకొని రాముడిని, సీతనే మొక్కుతున్నారని బండి సంజయ్ మాట్లాడారు. నేతలు మసీదుకు వచ్చి నమాజ్ చేస్తున్నారని ముస్లింలు అందరూ ఆ నేతలకు ఓట్లు గుద్దేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలానే జరుగుతుందా? కేటీఆర్ చెప్పాలని అన్నారు.
కేసీఆర్ తీరు.. అవసరం అనుకుంటే రామాయణాన్ని మొత్తం మార్చేసి అయోధ్యలో రాముడు పుట్టలేదని తిరిగి చరిత్ర రాసినా రాస్తారని మాట్లాడారు. ఎన్నికలు రాగానే కేసీఆర్ కు రామ జన్మభూమి గుర్తుకొస్తుందని అన్నారు. వినాయక చవితికి మైకులు పెట్టుకోవాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. దేవాలయాల్లో పూజలు చేసే సాధుసంతులు, పూజారులు బయటికి రావాల్సిన అవసరం ఉందని, దీనిపై గళం ఎత్తాలని పిలుపు ఇచ్చారు.
తాను కర సేవలో పాల్గొన్నానని, ఆ విషయాన్ని తాను ధైర్యంగా చెబుతానని బండి సంజయ్ అన్నారు. బీజేపీని గెలిపిస్తే మియాపూర్ నుంచి సంగారెడ్డి దాకా మెట్రో రైలు లైను వేయిస్తామని హామీ ఇచ్చారు. మెట్రో ప్రాజెక్టులు ప్రధాని మోదీనే ఇస్తారని అన్నారు. గత ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టారని బండి సంజయ్ మండిపడ్డారు. యువతకి ఉద్యోగాలు రాకుండా చేసి, కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికి రాజకీయ ఉద్యోగాలు తెప్పించుకున్నారని అన్నారు. ప్రధాని మోదీ 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని బండి సంజయ్ చెప్పారు.