Telangana Election 2023 : కాంగ్రెస్ గెలిస్తే దళారుల రాజ్యం - ఓటు బ్రహ్మస్త్రంగా వాడాలని కేసీఆర్ పిలుపు
కాంగ్రెస్ గెలిస్తే దళారుల రాజ్యం వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. జుక్కల్‌లో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.
Telangana Election 2023 : 2004లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ ఇస్తే ఇప్పటికంటే మరింతగా అభివృద్ధి చెంది ఉండేవారమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జుక్కల్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో విచక్షణతో ఓటు వేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఎవరెవరో ఏదేదో చెబుతారని, వారి మాటలు వినవద్దన్నారు. మీపక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో రైతుల పరిస్థితి చూస్తున్నారన్నారు. ఈ రెండు రాష్ట్రాలు మీకు దగ్గరే ఉన్నాయన్నారు. పక్కనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని, కానీ మనం తెలంగాణలో ఇస్తున్నామన్నారు.
మహారాష్ట్ర మనకంటే పెద్ద రాష్ట్రం. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న అనేక నగరాలు మహారాష్ట్రలో ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ ఇప్పటికి రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు ఇస్తుందే తప్ప వాటిని అమలు చేసే విధానం లేదు. రైతుబంధు పేరుతో ప్రజల డబ్బు వృథా చేస్తున్నామని విపక్ష నేతలు అంటున్నారు. రెండు దఫాల్లో రూ.37వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు. ఎస్సీలను బాగు చేసేందుకే దళితబంధు తీసుకొచ్చాం. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా రాష్ట్రంలో ప్రతిఒక్కరూ కలిసి ముందుకెళ్లాలి. అభివృద్ధే మన లక్ష్యం కావాలి.. మరింత ప్రగతి సాధించాలని కేసీఆర్ తెలిపారు.
ఇవాళ తెలంగాణలో మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేసుకున్నాం అని కేసీఆర్ తెలిపారు. వాగుల మీద చెక్ డ్యాంలు కట్టుకున్నాం. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నాం. 100 ఏండ్ల కింద నిజాం రాజు నిజాం సాగర్ కట్టారు. సమైక్య పాలకుల రాజ్యంలో నిజాంసాగర్ ఎండిపోయింది. మన బాధలు ప్రపంచానికి తెలియాలని ఎండిపోయిన నిజాం సాగర్‌లోనే తెలంగాణ ఉద్యమం మీటింగ్ పెట్టుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. ఒక దాని తర్వాత ఒక సమస్యను పరిష్కారం చేసుకుంటూ వచ్చామని కేసీఆర్ స్పష్టం చేశారు. జుక్కల్‌లో మంచినీళ్ల బాధలు చూశాం. కానీ ఇవాళ మిషన్ భగీరథతో మంచినీళ్లు ఇస్తున్నామన్నారు.
మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు రైతుబంధు దుబారా అంటున్నారని మండిపడ్డారు. రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. రైతుబీమా, రుణమాఫీ వంటి వాటితో రైతులకు ఊరట ఇచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంకులుగా వాడుకుందని ఆరోపించారు. కానీ మనం దళిత బంధుతో క్రమంగా అండగా నిలబడుతున్నామన్నారు. లంబాడీలను, ఆదివాసీలను గౌరవించే ఉద్దేశ్యంతో తండాలను గ్రామపంచాయతీలుగా చేశామన్నారు. గతంలో ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉండేవారని, కానీ ఇక్కడి ఎమ్మెల్యే షిండే మాత్రం నెలకు 25 రోజులు నియోజకవర్గంలోనే ఉంటున్నారన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణ బాధను పట్టించుకున్నది లేదన్నారు.
తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంతో రాష్ట్రం అభివృద్ధి చెందిందా? లేదా? చూడవచ్చునన్నారు. పదేళ్ల క్రితమే పుట్టిన మన తెలంగాణ ఎన్నో రాష్ట్రాలను దాటి వీటిలో ముందు ఉన్నదన్నారు. దేశంలోనే తలసరి ఆదాయంలో మనం మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. అలాగే విద్యుత్ ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే కనుక దళారుల రాజ్యం వస్తుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఉన్నంత వరకు సెక్యులర్‌గానే ఉంటుందన్నారు. ఎన్నికల్లో చాలా ఆలోచించి తెలంగాణ ప్రజలు ఓటు వేయాలని జుక్కల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కోరారు. ఎవరో చెప్పారని ఆగమాగం కాకుండా సొంత విచక్షణతో ఓటు వేయాలని పిలుపునిచ్చారు.ఓటు ఒక బ్రహ్మాస్త్రం అని దాన్ని సరైన పద్ధతుల్లోనే వాడితేనే మన తలరాత మారుతది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.