(Source: ECI/ABP News/ABP Majha)
KTR On Congress BC Declaration: 'మైనారిటీ, బీసీల మధ్య కాంగ్రెస్ చిచ్చు' - కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
Telangana Election 2023: మైనారిటీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ తప్పుడు వాగ్ధానాలు ఇస్తోందని ఆరోపించారు.
KTR Slams on Congress BC Declaration: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలు, బడుగు వర్గాల మధ్య చిచ్చు పెడుతోందని మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ (BC Declaration)ను ఆయన విమర్శించారు. మైనారిటీలను బీసీల్లో చేరుస్తామని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ (Congress Party) గతంలోనూ చాలాసార్లు తప్పుడు వాగ్దానాలు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. '2004 - 14 మధ్య కాంగ్రెస్ మైనారిటీల కోసం ఏం చేసింది. పదేళ్లలో కాంగ్రెస్ మైనారిటీల కోసం రూ.930 కోట్లు ఖర్చు చేస్తే, గత పదేళ్లలో బీఆర్ఎస్ రూ.10 వేల కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ స్ఫూర్తితో కాంగ్రెస్ ఈ మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినట్లుంది.' అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీల ఆటలు
కాంగ్రెస్ తప్పుడు వాగ్ధానాలు చేయడంలో దిట్ట అని కేటీఆర్ మండిపడ్డారు. గతంలోనూ ఇలాంటి హామీలనే ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. 'ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అలా చేస్తే మైనారిటీల ప్రత్యేక హోదా పోతుంది. మైనారిటీ డిక్లరేషన్ పేరుతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తోంది. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు రాజ్యాంగపరంగా మతపరమైన మైనారిటీలు. వీరి విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఆటలాడుతున్నాయి.' అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కుట్రలో భాగమే'
బీసీల కులగణనలోకి ముస్లింలను చేరుస్తామని కాంగ్రెస్ డిక్లరేషన్ చెబుతోందని, ఇది ఓ కుట్ర అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ డిక్లరేషన్ ను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తున్న ఈటల రాజేందర్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఇద్దరూ ఓటమి పాలవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
Also Read: Telangana Elections 2023 : కాంగ్రెస్ గెలిస్తే బీసీ వర్గాలకు పండగే - ఇవిగో బీసీ డిక్లరేషన్ వరాలు