Dalita Bandhu Scheme: దళిత బంధు ఎన్నికలకు ముందా..? తర్వాతా..?
దళితబంధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు కేసీఆర్. హుజూరాబాద్ ఉపఎన్నికలకు ముందే అమలు చేయాలని విపక్షాల డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం అమలును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ పథకంతో దళితులందర్నీ ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకు రావాలన్న లక్ష్యంతో ఉన్నారు. పథకాన్ని ప్రారంభించబోతున్న హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి.. దాదాపుగా నాలుగు వందల మంది దళితుల్ని ప్రగతిభవన్‌కు పిలిపించి.. విందు ఇచ్చి మరీ సలహాలు సూచనలు తీసుకున్నారు. మరో వైపు అధికారులు.. ఈ పథకంతో నగదు బదిలీ చేయడమే కాకుండా.. వారిని ఎలా వ్యాపారస్తులుగా మార్చారో ప్రణాళికలు సిద్దం చేశారు. అన్నీ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోతున్నాయి. అయితే.. ఎప్పుడు అమలు అన్నదానిపై మాత్రం ఇంత వరకూ క్లారిటీ లేదు.
ఉపఎన్నికల షెడ్యూల్ కంటే ముందే నగదు బదిలీ జరగాలి..!
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో లబ్ది పొందడానికే పథకం ప్రవేశ పెట్టామని కేసీఆర్ నిర్మోహమాటంగా ప్రకటించారు. అంటే.. దళిత బంధు పథకం ఖచ్చితంగా హుజూరాబాద్ ఎన్నికల్లోపునే ప్రారంభం కావాలి. అయితే.. అ ఆ ప్రారంభం లాంఛనంగా ఉంటుందా.. లేకపోతే.. మొత్తానికి అమలు చేసేస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. పథకం అమలు చేయాలంటే.. ముందుగా లబ్దిదారులను ఎంపిక చేయాలి. వారికి ఇచ్చే సొమ్ముతో పెట్టాల్సిన యూనిట్లను ఎంపిక చేయాలి. ఇదంతా బాగా సమయం తీసుకునే ప్రక్రియ. అందుకే.. ఎన్నికల్లోపు అమలు సాధ్యం కాదన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వినిపిస్తోంది. ఉపఎన్నికలు ఎప్పుడు వస్తాయన్నదానిపై స్పష్టత లేదు. ఎంత ఆలస్యంగా వస్తే అంత మంచిదని ఈ లోపు పథకం అమలు చేసి ఎన్నికలకు వెళ్లవచ్చని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వరద సాయం తరహాలో చేస్తారని విపక్షాల విమర్శలు..!
రాజకీయ లబ్ది కోసమే పథకం పెట్టారవి విపక్షాలు విమర్శిస్తున్నాయి. అది కూడా ఓ కారణమే అని కేసీఆర్ చెబుతున్నారు. ఇలా నేరుగా అంగీకరించినందున.. పథకం అమలు చేస్తామని ఆశ పెట్టి ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వం విమర్శల పాలవుతుంది. అందుకే.. ఉపఎన్నికల షెడ్యూల్ గురించి ఆలోచించకుండా వీలైనంత త్వరగా అమలు చేయాల్సి ఉందన్న అభిప్రాయ వినిపిస్తోంది. తెలంగాణ సర్కార్‌పై గతంలో చాలా విమర్శలు ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల సమయంలో... వరద సాయాన్ని ప్రతి ఇంటికి రూ. పదివేల చొప్పున ప్రకటించారు. సగం మందికి కూడా ఇవ్వకుండానే.. గ్రేటర్ నోటిఫికేషన్ ఇచ్చారు. బీజేపీ వల్లనే సాయం ఆపేశామని... గ్రేటర్ ఎన్నికలు ముగియగానే అందరికీ డబ్బు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత పంపిణీ చేయలేదు. ఇదే తరహాలో.. హుజూరాబాద్ ఓటర్లను మోసం చేస్తారని.. విపక్ష నేతలు.. అక్కడ ప్రచారం చేసే అవకాశం ఉంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుగానే అమలు చేయాలన్న సంకల్పంతో ఉంది.
దళిత వర్గాలకు నమ్మకం కుదరాలంటే ముందే అమలు చేయాలి...!
హుజూరాబాద్ లో దళిత బంధును సంపూర్ణంగా అమలు చేస్తేనే.. రాష్ట్రంలో ఇతర దళిత వర్గాలు ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుంటాయి. అలా నమ్మకం పెరగాలంటే.. ఎన్నికలకు ముందే.. పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ సర్కార్‌కు నిధుల కొరత కూడా లేదు. దాదాపుగా పదిహేను వందల కోట్ల వరకూ పథకానికి ఖర్చు అవుతాయి. దళిత ఎంపవర్ మెంట్ స్కీమ్ కింద..నిధులు కేటాయించారు. వాటిని రాష్ట్రం మొత్తం అమలు చేయాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో హుజూరాబాద్‌లోనే ఖర్చు చేస్తారు. అది ఎన్నికలకు ముందు చేయాల్సి ఉంది. ఒక వేళ పథకం అమలు చేయక ముందే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చి... కోడ్ కారణంగా ఎన్నికల తర్వాత అమలు చేస్తామని కేసీఆర్ సర్కార్ ప్రకటిస్తే ... అది అనేక అనుమానాలకు కారణం అవుతుంది.