Telangana Congress : టి.కాంగ్రెస్ లో సంక్షోభం, టీడీపీ నుంచి వచ్చిన 13 మంది రాజీనామా!
Telangana Congress : టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన 13 మంది నేతలు తమ పీసీసీ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 13 మంది తమ పీసీసీ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేతల ఆరోపణలతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తమకు పదవులు వద్దని, పదవులు రాని వారికి ఇవ్వాలని ఆ నేతలు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కి రాజీనామా లేఖలు పంపారు నేతలు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో నరేందర్‌రెడ్డి, సీతక్క, విజయరామారావు, చారగొండ, వెంకటేశ్, ఎర్ర శేఖర్ తమ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
కౌంటర్ ఇచ్చేందుకు రేవంత్ వర్గం సన్నద్ధం
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతల ఆరోపణలకు రేవంత్ రెడ్డి వర్గం కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ లో ఉంటూ ఇతర పార్టీలకు ఎలా సాయం చేస్తున్నారో బయటపెట్టేందుకు కార్యకర్తలకు చెప్పాలని యోచిస్తున్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ సీనియర్ల వర్గం కుట్ర చేస్తుందని రేవంత్ వర్గం ఆరోపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అధిష్టానం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ కార్యదర్శులు అసంతృప్తి నేతలతో మాట్లాడుతున్నట్లు సమాచారం. సోమవారం ఏఐసీసీ కార్యదర్శులు అసంతృతప్తి నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ముందు నుంచీ అసంతృప్తి
టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో కాంగ్రెస్ లో అసమ్మతి రేగింది. ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్న తమను కాదని, టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించడంపై సీనియర్ నేతలు ముందు నుంచీ అసంతృప్తిగా ఉన్నారు. అధిష్ఠానం నిర్ణయంపై గౌరవంతో ఇన్నాళ్లు ఆ నేతలు అసంతృప్తిని దిగమింగుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి వంటి నేతలు పార్టీని వీడారు. తాజాగా కమిటీల కూర్పు విషయంలో ఈ అసంతృప్తి మరింత పెరిగి కాంగ్రెస్ సీనియర్లు బహిరంగంగా రేవంత్ పై విమర్శలకు దిగారు. పార్టీ సీనియర్ల సహకారం లేకుండా రేవంత్‌రెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తికంగా మారింది.
కీలక సమావేశానికి దూరంగా అసంతృప్తి నేతలు
టీపీసీసీ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ గాంధీ భవన్ లో ప్రారంభమైంది. ఈ భేటీలో రాహుల్ గాంధీ పాదయాత్ర అనంతరం చేపట్టే 'హాత్ మే హాత్ జోడో' కార్యక్రమాలపై చర్చించనున్నారు. జనవరి 26 నుంచి తర్వాత రాహుల్ పాదయాత్ర లక్ష్యాలను జనాల్లోకి తీసుకువెళ్లేలా "హాత్ మే హాత్" కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ నిర్ణయించింది. రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అసంతృప్తి నేతలు నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ కమిటీల కూర్పుపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి వివాదం మరింత ముదిరింది. కాంగ్రెస్ కమిటీ పదవులకు టీడీపీ నుంచి వచ్చిన నేతలు రాజీనామా చేశారు. సీనియర్ల ప్రచారంపై ఆ నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రాజీనామా లేఖలను మాణిక్కం ఠాగూర్‌కు పంపారు వలస నేతలు.