Bharat Jodo Yatra : నవంబర్ 7న తెలంగాణలో జోడో యాత్ర ముగింపు, భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు!
Bharat Jodo Yatra : ఈ నెల 7వ తేదీన తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. అదే రోజు రాత్రి భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తుంది.
Bharat Jodo Yatra : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 7 వ తేదీ రాత్రి తెలంగాణలో ముగుస్తుంది. జుక్కల్ తర్వాత మెనూరులో చారిత్రాత్మక బహిరంగ సభను నిర్వహించనున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రకటనలో తెలిపారు.
జోడో యాత్రకు అద్భుత స్పందన
తెలంగాణ రాహుల్ భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి అద్భుత స్పందన, మద్దతు లభించాయని కాంగ్రెస్ నేతలు అన్నారు. అక్టోబర్ 23న కర్ణాటక నుంచి తెలంగాణలోని మక్తల్ లో అడుగు పెట్టిన భారత్ జోడో యాత్ర 27వ తేదీ నుంచి వరసగా జరిగిందన్నారు. పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటించారన్నారు. సామాజిక కార్యకర్తలు, కుల సంఘాలు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, బాధితులు, మహిళ సాధికారిత కార్యకర్తలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, చిన్న పిల్లలు, క్రీడాకారులు ఇలా అనేక వర్గాల వారు రాహుల్ గాంధీని కలిసి వారి సమస్యలు వివరించారని ఆయన వారితో సానుకూలంగా మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నారని తెలిపారు.
తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, విలువల కోసం, ఎవరికి తలవంచక, దేశ ప్రజలకోసం, వారి బ్రతుకులలో వెలుగు నింపటం కోసం, ఒక మహాయజ్ఞంలో దేశ నాయకుడు రాహుల్ గాంధీ. @RahulGandhi
— Telangana Congress (@INCTelangana) November 5, 2022
#BharatJodoYatra #ManaTelanganaManaRahul pic.twitter.com/6EiHC2x3Ky
నవంబర్ 7న తెలంగాణలో ముగింపు
అక్టోబరు 23న ప్రారంభమైన పాదయాత్ర నవంబర్ 7న తెలంగాణలో ముగుస్తుందని ఆ రోజు రాత్రి మహారాష్ట్రలో అడుగు పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు అన్నారు. తెలంగాణ సమాజం రాహుల్ కు అండగా నిలబడిందన్నారు. జోడో యాత్రను పెద్దఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో సాగిన జోడో యాత్ర పూర్వ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో సాగిందని అన్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రాలేదని అన్నారు. ఈ నెల 7వ తేదీన జరిగే చివరి సభకు ప్రజలు భారీగా వచ్చి రాహుల్ కు మద్దతు పలకాలని వారు పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం రాత్రి 9.30 కు దెగ్లూరులో మహారాష్ట్ర కాంగ్రెస్ యాత్రను పరిచయం చేయబోతున్నామని తెలిపారు.
ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం
రైతులు, యువకులు, విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల యజమానుల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రలో ముందుకెళ్తున్నామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. దేశంలో ఇంత తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఎన్నడూ చూడలేదన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మెదక్ జిల్లా పెద్దాపూర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ మాట్లాడారు. 2014 తర్వాత కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రధాని మోదీ ప్రైవేట్ పరం చేశారని ధ్వజమెత్తారు.