Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, సాయంత్రం మల్లికార్జున ఖర్గేతో భేటీ!
Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ లతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Revanth Reddy Reaches Delhi - హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజులపాటు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. నేటి సాయంత్రం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, హామీల అమలు జరుగుతున్న తీరుపై వివరించనున్నారు.
వరంగల్‌లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీ రైతు రుణమాఫీ అమలును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జులై 18న రూ.1 లక్ష లోపు రుణాలు ఉన్న అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలక్షన్ టైంలో రాహుల్ గాంధీ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని అమలుచేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడాన్ని పురస్కరించుకుని భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రుణమాఫీ అమలుకు సంబంధించిన కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించడంలో భాగంగా ఢిల్లీకి వెళ్లినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు దాదాపు ఒకేసారి జరగనున్నాయి. కనుక రాహుల్ గాంధీతో చర్చించి సభ తేదీని నిర్ణయించనున్నారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చ జరుగుతోంది. గతంలో రేవంత్ ఢిల్లీనప్పుడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం, ఆఖర్లో అదేమీ లేదని తేలిపోయేది. సీఎం రేవంత్ తాజా ఢిల్లీ పర్యటన సైతం రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై ఏఐసీసీ పెద్దల్ని సంప్రదించి చర్చలు జరిపే అవకాశం ఉందని వినిపిస్తోంది. పనిలోపనిగా పార్టీ పనులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన నిధులు, అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రులను కలిసి సహకారం కోరనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ 25న అసెంబ్లీలో బడ్జెట్
ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణay అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ జారీ చేశారు. తొలిరోజు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే (బీఆర్ఎస్) లాస్య నందితకు సంతాపం తెలపనున్నారు. జులై 25వ తేదీన తెలంగాణ ప్రభుత్వం 2024- 25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, హామీల అమలు, రుణ మాఫీ, ఇతర పథకాలకు నిధులు సమకూర్చేలా బడ్జెట్ రూపొందించనున్నారు. దాదాపు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల ఏడాది కనుక ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రవేశపెట్టిన ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ గడువు ఈ నెలతో ముగియనుంది. దాంతో ఆగస్టు నుంచి ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేవరకు స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీనిపై డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలు సేకరించి సమీక్షించారు. హామీల అమలు కోసం అవసరమయ్యే నిధులను దృష్టిలో ఉంచుకుని భారీ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఛాన్స్ ఉంది.