(Source: ECI/ABP News/ABP Majha)
KCR Speech: ఈ 3 ప్రాజెక్టులు పూర్తైతే దేశంలోనే వజ్రం తునకలాగ తెలంగాణ: సీఎం కేసీఆర్
KCR About Palamuru Ranga Reddy Project: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మూడు నాలుగేళ్ల కిందటే పూర్తి కావాల్సి ఉన్నా.. స్థానిక నేతలు అడగనందున నీళ్లు రాలేదని, ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు సీఎం కేసీఆర్.
KCR About Palamuru Ranga Reddy Project: మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లా చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కొల్లాపూర్ సింగోటం చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డ అంటే హైదరాబాద్ లో అడ్డా మీద వలస కూలి. నేడు బెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక నుంచి కూలీలను తెచ్చి వ్యవసాయం చేయిస్తున్నాడు పాలమూరు రైతు అని పేర్కొన్నారు. తెలంగాణ వస్తేనే దరిద్రం మాయమవుతుందని, నీళ్లు, హక్కులు, నిధులు, ఉద్యోగులు వస్తాయని గతంలో పలుమార్లు ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. మహబూబ్ నగర్ ఎంపీగానే తాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని చెప్పారు.
తెలంగాణలో మనకు రావాల్సిన వాటాలు చూసి 3 పెద్ద ప్రాజెక్టులు.. గోదావరిపై 2 కాళేశ్వరం, ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు.. పాలమూరులో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు.. ఈ మూడు పూర్తయితే దేశంలోనే తెలంగాణ వజ్రం తునకలాగ అందరికీ అన్నం పెట్టేలా మారుతుందన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం, సీతారామ ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మూడు నాలుగేళ్ల కిందటే పూర్తి కావాల్సి ఉన్నా.. స్థానిక రాజకీయ నాయకులు అడగని కారణంగా నీళ్లు రాలేదని, ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు.
బచావత్ ట్రైబ్యూనల్ తీర్పు సమయంలో తెలంగాణ వాళ్లు మహబూబ్ నగర్ కు నీళ్లు అడగలేదని జడ్జీలే.. 17 టీఎంసీలతో జూరాల ప్రాజెక్టు అనుమతి ఇచ్చారు. మహబూబ్ నగర్ ఏపీలో కలవకుండా ఉండే బాగుపడి ఉండేదని సుప్రీంకోర్టు జడ్జి బచావత్ జూరాల ప్రాజెక్టు ఇచ్చారని గుర్తుచేశారు. 1981 వరకు జూరాలను పట్టించుకోలేదని, కానీ అప్పుడు అంజయ్య సీఎంగా శంకుస్థాపన చేశారన్నారు. 2001లో గులాబీ జెండా ఎగిరిన తరువాత మహబూబ్ నగర్ మీటింగ్ లో గర్జించానన్నారు. చంద్రబాబు నువ్వు దత్తత తీసుకున్నావు, పాలమూరును ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. తాను నిలదీయడంతో అప్పటికప్పుడు కర్ణాటక ప్రాజెక్టుకు డబ్బులు కడితే, జూరాల ప్రాజెక్టు పనులు మొదలయ్యాయని చెప్పారు.
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ 1954లో అయిన ప్రాజెక్టు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తొలి పాదయాత్ర అలంపూర్ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేసినట్లు గుర్తుచేశారు. కేసీఆర్ ఒత్తిడికి రాజోలిబండ తూములు మూసేస్తే బాంబులు పెట్టి బద్దలుకొడతామని రాయలసీమ నేతలు హెచ్చరించారు. కేసీ కెనాల్ కు నీళ్లు ఇచ్చే సుంకేసుల ప్రాజెక్టు మీద ఉండి.. బైరెడ్డి రాజశేఖరరెడ్డి దేవుడు నీకు 6 చేతులు ఏమైనా ఇచ్చాడా.. ఆర్డీఎస్ తూములు నువ్వు బద్దలుకొట్టడం కాదు, అక్కడ ఎవరైనా అడుగుపెడితే సుంకేసుల బ్యారేజీని 100 బాంబులు పెట్టి పేల్చేస్తా అని వార్నింగ్ ఇచ్చినట్లు గుర్తుచేశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో తన వ్యాఖ్యలపై ఆరా తీయగా.. పాలమూరులో నేను చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ప్రజలు సంతోషించారని రిపోర్ట్ వచ్చిందన్నారు. ఇంటి దొంగలే మనకు ప్రాణగండంగా మారారని, ప్రాజెక్టును, ఇక్కడి వారికి నీళ్లను అడ్డుకున్నారని ఆరోపించారు. పదవులు, పైరవీల భయానికి నోరు ఎత్తడం లేదని ప్రశ్నిస్తే.. నీళ్లు కింద ఉన్నాయని మనం గడ్డమీద ఉన్నామని నేతలు చెప్పారు. అయితే మీ మెదడు మోకాళ్లలో ఉందని గట్టిగా బదులిచ్చానని, ఆరోజు అలా మాట్లాడిన నేతలు ఇంకా బతికే ఉన్నారని చెప్పారు. ఈరోజు నీళ్లు పారుతుంటే ప్రజలు పులకించి పోయారు. కాలువలు పూర్తికావాలి, మహబూబ్ నగర్ తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు దీని ద్వారా నీళ్లు రావాలని ఆకాంక్షించారు.