Telangana CM KCR: తెలంగాణలో మరో కొత్త పథకం, రూ.5 లక్షలు అందజేయాలని కేసీఆర్ నిర్ణయం
Kallu Geeta Karmika Bheema: మే డే సందర్భంగా నిన్న కార్మికులకు వెయ్యి జీతం పెంచుతూ శుభవార్త అందించిన తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Insurance for Toddy Tappers: మే డే సందర్భంగా నిన్న కార్మికులకు వెయ్యి జీతం పెంచుతూ శుభవార్త అందించిన తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుబీమా తరహాలోనే రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో కల్లుగీత కార్మికులకు ‘గీత కార్మికుల బీమా’ పథకాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కల్లు గీచే సమయంలో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. కల్లు గీస్తూ ప్రమాదంలో ఎవరైనా గీత కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందజేస్తామన్నారు. ఈ నగదు మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
నూతన సచివాలయంలో మంత్రులు, అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రైతు బీమా తరహాలోనే గీత కార్మికుల బీమా పథకం తీసుకురావడంపై మంత్రులు, అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఎప్పటినుంచో కల్లుగీస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఊహించని ప్రమాదం జరిగి కల్లుగీత కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం గీత కార్మికుల బీమా పథకం చేపట్టాలని భావిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. గీత కార్మికుల కోసం తీసుకొస్తున్న బీమా పథకానికి సంబంధించిన విధివిధానాలు రూపాందించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ శాంతికుమారిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
పారిశుద్ధ్య కార్మికుల వేతనం పెంచిన కేసీఆర్
మే డే సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పారిశుధ్య కార్మికులకు శుభవార్త చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.1000 మేర పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా 1 లక్షా 6 వేల 474 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. మే నెల నుంచి పెరిగిన వేతనాలను పారిశుధ్య కార్మికులు అందుకోనున్నారు. పనిలో పనిగా ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసి కార్మికుల వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై పారిశుధ్య కార్మికులు హర్షం చేస్తున్నారు.
జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా పెరిగిన వేయి రూపాయల వేతనం అదనంగా జీతంతో పాటు కలిపి అందుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎం తెలిపారు. ‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని సీఎం అన్నారు. రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రతీ ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.