BJP Telangana: తెలంగాణ బీజేపీకి కొత్త సారథి రాంచందర్ రావు నాయకత్వంలో సవాళ్లను అధిగమించి కమలం వికసిస్తుందా?
Ram Chander Rao : అధిష్టానం ఆశీస్సులతో రాంచందర్ రావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బీజేపీకి రాంచందర్ రావు ఐదో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Telangana BJP New President Ram Chander Rao : అధిష్టానం ఆశీస్సులతో రాంచందర్ రావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బీజేపీకి రాంచందర్ రావు ఐదో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి తొలి సారథిగా జి. కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత రెండో వ్యక్తిగా కె. లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ బీజేపీ మూడో అధ్యక్షుడిగా బండి సంజయ్, నాలుగో అధ్యక్షుడిగా మరోసారి జి. కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఇక తాజాగా ఐదో వ్యక్తిగా రాంచందర్ రావు ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీజేపీ పార్టీని ఒక్కో అధ్యక్షుడు తనదైన శైలిలో నడిపించారు. ఇక ఇప్పుడు రాంచందర్ రావు వంతు వచ్చింది. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తరుణంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
పార్టీలో అంతర్గత విబేధాలను రూపుమాపడం
పార్టీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకంపై పార్టీలో కొద్ది మంది సీనియర్లు వ్యతిరేకతతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఏకంగా ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడం దాకా పరిస్థితి వెళ్లింది. కారణాలు ఏమైనా, పార్టీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు ఎన్నికయ్యాక జరిగిన కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హాజరు కాలేదు. అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆసక్తికనబరిచిన వారిలో ధర్మపురి అర్వింద్‌తోపాటు, రాజాసింగ్ కూడా ఉన్నారు. వీరితోపాటు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్; ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు; బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి. కె. అరుణ; మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అధ్యక్షపదవిని ఆశించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ పేరు కూడా పార్టీలో చర్చ జరిగింది.
ఇలా సీనియర్ నేతలు చాలా మంది అధ్యక్ష పదవి కోసం ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు ఆ పదవి తమకు వరించలేదని కొందరు అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అందరినీ కలుపుకొనిపోవడం, అంతర్గత విబేధాలను రూపుమాపడం కొత్త అధ్యక్షుడు రాంచందర్ రావుకు కత్తిమీద సాము లాంటిదే. రాజా సింగ్ లాంటి వారి ఆగ్రహాన్ని చల్లార్చి, రాజీనామాను ఉపసంహరించుకోవడం కూడా సవాలే. లేనట్లయితే పార్టీ ఓ ఎమ్మెల్యేను కోల్పోవాల్సి వస్తుంది. పార్టీలో పాత నాయకులను, ఆయా పార్టీల్లోంచి చేరిన నేతల మధ్య సమన్వయం మరో సవాల్. పార్టీలో క్రమశిక్షణ నెలకొల్పి, నేతలను, కార్యకర్తలను ఒక తాటి మీదకు తేవడం నూతన అధ్యక్షుడి ముందున్న సమస్యలే. వీటన్నిటిని ఎలా సమన్వయం చేసుకుంటారు, సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్నది ఇప్పుడు కమలం పార్టీలో నెలకొని ఉన్న ప్రశ్నలు.
పార్టీ బలోపేతానికి ప్రణాళికల రూపకల్పన, అమలు
బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ప్రజాదరణ పెంచడం, పార్టీని బలంగా తయారు చేయడం కొత్త అధ్యక్షుడి ముందున్న మరో సవాల్. పార్టీకి అర్బన్ ఏరియాల్లో మంచి పట్టు ఉంది. దాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లే ప్రణాళికలు తయారు చేయడం, వాటిని అమలు చేయడం కొత్త అధ్యక్షుడి ముందున్న టాస్క్ అనే చెప్పాలి. మరి కొద్ది రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి, గ్రామాల్లో కమలం పార్టీ గట్టిగా పని చేస్తేనే తప్ప మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న బీజేపీ నేతల ప్రకటనలు నిజరూపం దాల్చాలంటే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ అధ్యక్షుడు, సీనియర్లు, జూనియర్లు, పార్టీ క్యాడర్ చెమటోడ్చాల్సిందే.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం జెండా ఎగురవేయడం
శాసన సభ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ గతంలో కన్నా మంచి ఫలితాలు సాధించింది. పార్టీకి ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు (పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్‌తో కలిపి), 8 మంది ఎంపీలు, 1 రాజ్యసభ సభ్యుడు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. గతంలో ఇంత మంది ప్రజాప్రతినిధుల బలం బీజేపీకి లేదు. ఇప్పుడు రానున్న పంచాయతీ, మున్సిపాలిటీ, జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కమలం పార్టీ తమ సత్తా చూపించాల్సి ఉంది. ఇంత మంది ప్రజాప్రతినిధులతో నూతన అధ్యక్షుడు రాంచందర్ రావు మంచి ఫలితాలు సాధించాలని బీజేపీ అధిష్టాన పెద్దలు సైతం టార్గెట్ పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలన్నది ఎన్నో ఏళ్ళ నుంచి బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో 46 డివిజన్లలో బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఎక్కువ స్థానాల్లో గెలవాలన్నది ఆ పార్టీ లక్ష్యం. ఈ దిశగా పార్టీని నడిపించి, జీహెచ్‌ఎంసీలో ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలిపించడం కొత్త అధ్యక్షుడికి సవాల్‌తో కూడుకున్న పనే.
ఉపఎన్నికలో గెలుపు నూతన నాయకత్వానికి పరీక్షే
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ స్థానంలో సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్‌ది. ఉపఎన్నికలో బీజేపీని గెలిపించడం అనేది కొత్త సారథికి అగ్ని పరీక్షనే. ఇప్పటి వరకు బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికార పీఠం దక్కించుకుంటామని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికలో గెలుపు కీలకం అనే చెప్పాలి. దీన్ని బట్టే బీజేపీ బలం ఎంత పెరిగింది, కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా, బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ కానుందా అన్న చర్చకు ఈ ఉపఎన్నిక ఫలితం తేల్చనుంది.
కాంగ్రెస్ పాలనపై పోరాట ప్రణాళికలు
ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనపై కొత్త అధ్యక్షుడి సారథ్యంలో ఎలా పోరాడుతుందన్నది కీలకంగానే చెప్పాలి. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీనే. ప్రజలకు అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రణాళికలతో ప్రజల్లోకి వెళ్తారన్నది కొత్త సారథికి ఛాలెంజ్ లాంటిదే. బీఆర్ఎస్ పార్టీని ఎలా నిలువరించి బీజేపీని ముందుకు తీసుకెళ్తారన్నది కూడా సవాల్‌తో కూడుకున్న పనే. ఈ విధంగా రెండు పార్టీలను వెనక్కు నెట్టి, బీజేపీని తెలంగాణలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతారా, ఎలాంటి ప్రణాళికలు తయారు చేస్తారన్నది వేచి చూడాలి.
2028 అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ రూపకల్పన
ప్రతి పార్టీకి అధికార పీఠం దక్కించుకోవడమే ప్రధాన లక్ష్యం. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు కాషాయపార్టీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది. ఇక ఆ రాష్ట్రం మినహా మరే దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ అధికారం దక్కించుకోలేకపోయింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఆ పార్టీని ఊరిస్తోంది. గత శాసన సభ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీజేపీ నేతల్లో ఉత్సాహాన్ని నింపాయి. గట్టిగా కష్టపడితే తెలంగాణలో అధికార పీఠం దక్కించుకోవడం పెద్ద కష్టం కాదన్న అభిప్రాయంలో జాతీయ నేతలు ఉన్నారు. ఆ దిశగా పార్టీని నడిపించాల్సిన బాధ్యత ఇప్పుడు కొత్త సారథిదే.
అయితే ఇప్పటికిప్పుడు అనుకున్న ఫలితాలు రాకున్నా, రానున్న రోజుల్లో మరింత పటిష్టమైన పార్టీగా బీజేపీని నిలబెట్టడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీని నడపడం కీలకమైన లక్ష్యాలు. అయితే ఈ విషయంలో నూతన సారథి రాంచందర్ రావు తనదైన ముద్ర వేస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి.






















