Telangana BJP: తెలంగాణలో బీజేపీ మేనిఫెస్టోకి వెరైటీ పేరు, విడుదల చేయనున్న అమిత్ షా
Telangana Elections 2023: బీఆర్ఎస్ మేనిఫెస్టోతో పాటు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు ధీటుగా బీజేపీ ఏడు ప్రధాన అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచినట్లుగా బీజేపీ శ్రేణులు వెల్లడించాయి.
Telangana BJP News: రాబోయే తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను రూపొందించింది. ఈ మేనిఫెస్టోను నవంబర్ 18న హైదరాబాద్‌లో అమిత్ షా విడుదల చేయనున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించడం లక్ష్యంగా తయారు చేసిన ఈ మేనిఫెస్టోకు ఈసారి వినూత్నంగా నామకరణం చేశారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోకు ‘ఇంద్రధనుస్సు’ అని నామకరణం చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో పాటు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు ధీటుగా బీజేపీ ఏడు ప్రధాన అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచినట్లుగా బీజేపీ శ్రేణులు వెల్లడించాయి.
‘ప్రధాన మంత్రి నరేంద్రమోదీనే గ్యారెంటీ’తో బీజేపీ ఈ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించబోతుంది. నవంబరు 18 కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో ఈ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ప్రధానంగా ఫ్రీ ఎడ్యుకేషన్, వైద్యంతో పాటు నిరుద్యోగులు, రైతులకు లబ్ధి చేకూర్చడం లక్ష్యంగా రూపొందించిన అంశాలతో ఈ మేనిఫెస్టోను తయారు చేసినట్టు సమాచారం. రైతులకు శుభవార్తగా వరి పంటకి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.3,100కి పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల ఆరోగ్య బీమాను రూ.10 లక్షల వరకు పెంచాలని చూస్తున్నట్లుగా కూడా బీజేపీ యోచిస్తోంది.
రేపు హైదరాబాద్ కు అమిత్ షా
అమిత్ షా రేపు (నవంబరు 17) తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ షెడ్యూల్ ఖరారు అయింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా.. శుక్రవారం రాత్రి 11గంటలకు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11:30గంటలకు బేగంపేటలోని ఐటీసీ కాకతీయకు చేరుకొని రాత్రికి బస అక్కడే చేస్తారు. శనివారం ఉదయం 10.30 గంటలకు కత్రియా హోటల్ కు చేరుకుని బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసి, మధ్యాహ్నం 12.45గంటల నుంచి 1.20 గంటల వరకు గద్వాల సభలో పాల్గొంటారు.
గద్వాలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 1: 20 గంటల వరకు గద్వాల, 2:45 నుంచి 3:20 గంటల వరకు నల్గొండ, సాయంత్రం 4:10 నుంచి 4:45 గంటల వరకు వరంగల్లో నిర్వహించే విజయ సంకల్ప సభల్లో పాల్గొంటారు. వరంగల్ పర్యటన ముగించుకుని బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్ కు 6:10కు చేరుకుని 6: 45 వరకు విశ్రాంతి తీసుకోనున్నారు.
రాత్రి 7 గంటల నుంచి 7:45 గంటల వరకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో ఎమ్మార్పీఎస్ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడంతో పాటు ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మార్పీఎస్ నేతలతో చర్చించనున్నారు. ఆ సమావేశం ముగించుకుని అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి రాత్రి 8: 15 గంటలకు చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.