KTR Comments in Kodangal: 'కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?' - రేవంత్ రెడ్డి ప్రజలను కొనలేరన్న కేటీఆర్
Minister KTR: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 5 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో, 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
![KTR Comments in Kodangal: 'కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?' - రేవంత్ రెడ్డి ప్రజలను కొనలేరన్న కేటీఆర్ telangana assembly election 2023 minister ktr Comments in kodangal meeting KTR Comments in Kodangal: 'కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?' - రేవంత్ రెడ్డి ప్రజలను కొనలేరన్న కేటీఆర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/09/b0f7ebc2abc4c59cea1f4866a1aca50f1699531778664876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ktr Comments: అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. కొడంగల్ (Kodangal) లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, కరెంట్ పోయిందని విమర్శించారు. కర్ణాటక రైతులు కొడంగల్ వచ్చి ధర్నాలు చేస్తున్నారని, అక్కడి ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించినందుకు చెంపలు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 'తెలంగాణలో 24 గంటల విద్యుత్ కాదని 5 గంటలు విద్యుత్ ఇస్తామంటున్నారు. కొడంగల్ పేరును అంతర్జాతీయ స్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి (Revanthreddy). రూ.50 లక్షలతో అడ్డంగా దొరికారు. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపిస్తే, కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా ప్రమోషన్ ఇప్పిస్తా. కొడంగల్ ను అద్భుత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా.' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
'తెలంగాణ దేశానికే ఆదర్శం'
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని, సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 'వచ్చే రెండేళ్లలో కొడంగల్‌లోని 1.25 లక్షల ఎకరాలకు కృష్ణా నీళ్లిస్తాం. మద్దూరును మున్సిపాలిటీగా చేసే బాధ్యత నేను తీసుకుంటా. కొడంగల్‌లో ఆర్డీఓ కార్యాలయం, 100 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు, ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటా. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. కొడంగల్‌ను అద్భుత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం’’ అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
'రేవంత్ రెడ్డి ప్రజలను కొనలేరు'
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైసలను నమ్ముకున్నారని, లీడర్లను కొంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజలను మాత్రం ఆయన కొనలేరని అన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన నేత కేసీఆర్ అని, ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ నే దాటిపోయామని వివరించారు. '18 ఏళ్లు నిండిన ఆడబిడ్డల కోసం కొత్త కార్యక్రమాలు అమలు చేస్తాం. సౌభాగ్యలక్ష్మి కింద ఆడబిడ్డ ఖాతాలో రూ.3 వేలు వేస్తాం. గ్యాస్ సిలిండర్ పై పెంచిన రూ.800 భరించి రూ.400కే ఇస్తాం. తెల్లకార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల కేసీఆర్ బీమా అందిస్తాం.' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేటీఆర్ కు తప్పిన ప్రమాదం
కొడంగల్ రోడ్ షోలో పాల్గొనడానికి ముందు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీఆర్ఎస్ నామినేషన్ ర్యాలీలో జరిగిన ప్రమాదంలో మంత్రి కేటీఆర్ కు ముప్పు తప్పింది. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి (Jeevanreddy) నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ (Minister Ktr) హాజరై బీఆర్ఎస్ శ్రేణులతో ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లారు. ప్రచార రథంపై కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి ఇతర నేతలు వెళ్తుండగా, వాహన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో రెయిలింగ్ విరిగింది. ఈ క్రమంలో దాన్ని ఆనుకుని ఉన్న నేతలు ఒక్కసారిగా తూలి కిందపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే కేటీఆర్ ను పట్టుకున్నారు. అయితే, మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మూర్ పట్టణంలోని పాత ఆలూరు రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. నామినేషన్ అనంతరం కేటీఆర్ కొడంగల్ రోడ్ షోలో పాల్గొన్నారు. భగవంతుని దయ వల్ల తనకు ప్రమాదం తప్పిందని, కార్యకర్తలెవరూ ఆందోళన చెందొద్దని ఆయన తెలిపారు. ప్రమాదం తర్వాత కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కవిత కేటీఆర్ కు ఫోన్ చేశారు. ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 'టేక్ కేర్ రామన్న' అంటూ ట్వీట్ చేశారు.
Also Read: KCR in Kamareddy: 50 లక్షలతో దొరికిన వ్యక్తి నాపై పోటీ చేస్తాడా? మీరే బుద్ధి చెప్పండి - కేసీఆర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)