Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా అంశం వివాదాస్పదమయింది. ఇందిరాగాంధీని ఉద్దేశించి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana Assembly BJP MLA Rakesh Reddy: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇప్పసారా అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రతిపాదించిన ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో పెను దుమారాన్ని రేపాయి. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఈ మాటల యుద్ధంతో సభలో గందరగోళం నెలకొంది.
ఇప్పసారాను బ్రాండ్ చేయాలన్న అనిరుథ్ రెడ్డి
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వుతో తయారు చేసే సారా ఇప్పసారా ను శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేయాలని, దానిని ఒక బ్రాండ్‌గా విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం లభిస్తుందని అసెంబ్లీలో ప్రతిపాదించారు. గిరిజనుల సంప్రదాయ వేడుకల్లో భాగంగా ఉండే ఈ పానీయానికి అంతర్జాతీయ గుర్తింపు తేవాలని ఆయన కోరారు.
ఇందిరమ్మ పేరు పెట్టవద్దని సెటైర్ వేసిన రాకేష్ రెడ్డి
ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి స్పందిస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చాలా పథకాలకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు పెడుతోందని, అయితే ఒకవేళ ఈ ఇప్పసారాను ప్రభుత్వం తయారు చేస్తే దానికి మాత్రం ఇందిరమ్మ పేరు పెట్టవద్దని సెటైర్ వేశారు. దీనికి బదులుగా ఇప్ప టకీలా వంటి ఇతర పేర్లు పెట్టుకోవాలని ఆయన సూచించారు.
రాకేష్ రెడ్డి సైటైర్లపై కాంగ్రెస్ ఆగ్రహం
రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలపై అధికార పక్షం ఒక్కసారిగా భగ్గుమంది. సారా వంటి అంశంపై మాట్లాడుతున్నప్పుడు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పేరును తీసుకురావడం మహిళా లోకాన్ని, దేశ నాయకురాలిని అవమానించడమేనని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క తీవ్రంగా మండిపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నాయకురాలిని ఇలాంటి అంశాలతో పోల్చడం తగదని, రాకేశ్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రికార్డుల వ్యాఖ్యల తొలగింపు
మంత్రి శ్రీధర్ బాబు రాకేశ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై బీజేపీ సభ్యులు స్పందిస్తూ తాము అన్‌పార్లమెంటరీగా ఏమీ మాట్లాడలేదని, కేవలం సలహా మాత్రమే ఇచ్చామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు జోక్యం చేసుకుంటూ.. తప్పుగా మాట్లాడి ఉంటే రికార్డుల నుంచి తొలగించాలని, దీనిపై గంటల తరబడి సభ సమయాన్ని వృధా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. చివరకు స్పీకర్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.
Before You Go
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు






















