Telanagana Kaviat Petition: కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
కృష్ణా జలాల పంపిణీకి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ రిటర్న్స్ పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవయట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినాలని కోరింది.
కృష్ణా జలాల పంపిణీకి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ శుక్రవారం జారీ చేసిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR)పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ చేపట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు అప్పగించింది. దీనికి సంబంధించిన గెజిట్ సైతం జారీ చేసింది. కాగా, దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ వాదనలు వినకుండా తీర్పు వెలువరించరాదంటూ తెలంగాణ సర్కార్ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
కేఆర్ఎంబీ అఫిడవిట్
కృష్ణా జలాల వాడకం విషయంలో ఏపీ ప్రభుత్వం, తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సాగు, తాగు నీటి అవసరాలేవీ లేకున్నా శ్రీశైలం జలాశయం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేపట్టి కృష్ణా జలాలను దిగువకు వదిలేసిందంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఇచ్చిన నోటీసుల మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ తరఫున కృష్ణా బోర్డు ప్రమాణ పత్రం సమర్పించింది. సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది.
కేటాయింపులు ఇలా
శ్రీశైలం, నాగార్జున సాగర్ ల నుంచి తెలుగు రాష్ట్రాలకు తాగునీటి కేటాయింపులకు సంబంధించిన సమావేశం మినిట్స్ ను కృష్ణా బోర్డు సోమవారం విడుదల చేసింది. ఏపీకి శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 15 టీఎంసీలు, తెలంగాణకు 2 జలాశయాల నుంచి 35 టీఎంసీలను కేటాయించారు. కాగా, ఇప్పటి వరకూ ఏపీ 95 టీఎంసీలను, తెలంగాణ 48 టీఎంసీలను వినియోగించుకున్నాయి. రెండు జలాశయాల్లో కలిపి కేటాయింపులు పోగా 2.78 టీఎంసీల మిగులు ఉంది. నీటి ఎద్దడి నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది.
ఏపీ సీఎం జగన్ లేఖలు
కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కేంద్ర గెజిట్ విడుదలైన నేపథ్యంలో మరోసారి ప్రధాని మోదీ, హోంమంత్రులకు లేఖ రాయాలని నిర్ణయించారు. కాగా, కృష్ణా నీటి పంపకాల పునఃసమీక్ష బాధ్యతలను కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు అప్పగించడం, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు అంశాలపై ఆయన సోమవారం అధికారులతో సమీక్షించారు.
విభజన చట్టానికి విరుద్ధం
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా, విభజనం చట్టం సెక్షన్ 89కు విరుద్ధంగా కేంద్ర గెజిట్ ఉందని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం చెబుతుండగా ఇప్పుడు దానికి విరుద్ధంగా ఈ నిర్ణయం ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్ లో ఉండగా గెజిట్ ఇవ్వకూడదని వివరించారు. గోదావరి నుంచి 214 టీఎంసీలు తెలంగాణ తరలిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదంటూ పేర్కొన్నారు.
తెలంగాణ వాదన ఇదీ
తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాలను అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టుబట్టారు. కృష్ణా, గోదావరి జలాలను ప్రాజెక్టుల వారీగా మాత్రమే పంపిణీ చేయాలని అప్పటికే ఉన్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్రం రిఫర్ చేసింది. అలా చేస్తే తెలంగాణకు ఒరిగేదేమీ ఉండబోదని కేసీఆర్ వాదించారు. దీనిపై కేంద్రానికి లేఖలు రాస్తూ ఒత్తిడి తీసుకువచ్చారు.