Ramoji Rao: రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతుల నివాళి - రామోజీ స్ఫూర్తితో ముందుకు సాగుతామన్న చంద్రబాబు
Ramoji Rad Death: రామోజీరావు పార్థీవదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. ఢిల్లీ నుంచి ఫిలింసిటీకి చేరుకున్న ఆయన రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
Chandrababu Pays Tribute To Ramoji Rao Parthivadeha: మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramoji Rao) పార్థీవదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి (Bhuvaneswari) నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భువనేశ్వరి రామోజీరావు కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ నెల 9న ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. రామోజీరావు మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చిత్ర పటానికి అక్కడే నివాళి అర్పించారు. అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫిల్మ్ సిటీకి చేరుకుని రామోజీ పార్థీవ దేహానికి నివాళి అర్పించారు.
రామోజీ స్ఫూర్తితో..
రామోజీరావు చివరి వరకూ సమాజ హితం కోసమే పని చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రామోజీ పార్థీవదేహానికి చంద్రబాబు దంపతులు నివాళి అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలను చైతన్య వంతులను చేయడానికి ఆయన అనుక్షణం పరితపించారని కొనియాడారు. 'రామోజీరావు ఓ వ్యక్తి కాదు.. ఆయన ఓ గొప్ప శక్తి. ఈనాడు ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని, విజ్ఞానవంతుల్ని చేశారు. జర్నలిజానికి విశేష సేవలందించారు. మొదటి నుంచి ప్రజల పక్షాన నిలబడతానని చెప్పిన గొప్ప వ్యక్తి. ఫిలింసిటీని నిర్మించి చిత్ర పరిశ్రమకు ఎనలేని సహకారం అందించారు. రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తితో తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్తా. రామోజీ కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు
రామోజీరావు అస్తమయంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. రామోజీరావు తెలుగు వెలుగు అని.. సమాజ హితం కోసం అనుక్షణం పని చేసిన ఆయన కీర్తి అజరామరం అని పేర్కొన్నారు. మంచిని మంచిగా.. చెడును చెడుగా చెప్పే ఆయన తీరు.. తనను ఆయనకు దగ్గర చేసిందని అన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.