Viral News: గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకుంటే ఏట్లో ముంచేసింది - ఏకంగా మునిగిపోయిన లారీ!
Viral News: సిద్దిపేట జిల్లా గుడాటిపల్లి వద్ద ఓ లారీ గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలో చిక్కుకుంది. స్థానికులు తాళ్లు కట్టి బయటకు తీశారు.
Viral News: ఏదైనా తెలియని ఊరికి వెళ్లే వారు దారి పొడవునా వాహనదారులను, స్థానికులను అడుగుతూ తమ గమ్యస్థానానికి చేరుకునే వారు. హైదరాబాద్ లాంటి సిటీలోని గల్లీలకైనా, మారుమూల గ్రామాలకైనా వెళ్లడానికి ఒకప్పుడు ఇదొక్కటే పరిష్కారం. దారి తెలిస్తే ఓకే.. తెలియకపోతే దారి పొడవునా అడుగుతూ ముందుకు సాగడమే. కానీ, ఇప్పుడు అలా కాదు. స్మార్ట్ ఫోన్ తీసి, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి.. ఎక్కడి వెళ్లాలో కొడితే చాలు.. అదే రెండు మూడు దారులు చూపిస్తుంది. ఏ దారిలో వెళ్తే ఎంత దూరం ఉంటుంది, ఎంత సమయంలో వెళ్లవచ్చో చెప్పేస్తుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే రోడ్లపై ఎంత ట్రాఫిక్ ఉందో కూడా చెప్పేస్తుంది. సందు గొందుల్లోంచి దారి చూపిస్తూ చివరికి గమ్యస్థానానికి చేరుస్తుంది.
అయితే కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ ఒక చోటుకు వెళ్లాలనుకుంటే.. మరో చోటుకు తీసుకెళ్లడం చాలా మందికి అనుభవమే. కొన్నిసార్లు గూగుల్ ముందుకు వెళ్లమని దారి చూపిస్తుంది, అక్కడేమో ముందు దారి ఉండదు. మరికొన్ని సార్లు పక్క వీధిలో ఉండే గమ్యస్థానానికి వెళ్లడానికి ఊరంతా తిప్పి తీసుకెళ్తుంది. ఇలాంటి అనుభవాలు గూగుల్ మ్యాప్స్ వాడే చాలా మందికి జరిగే ఉంటాయి. రోడ్లు మూసేసినా, మరమ్మతుల వల్ల దారి మళ్లించినా, ఇతర కారణాల వల్ల ఆ దారిలో వెళ్లలేని పరిస్థితి ఉన్నా.. అవన్నీ గూగుల్ కు తెలియవు కాబట్టి అదే పాత దారి చూపిస్తుంది. అలాంటి సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అయితే అలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడు తమిళనాడు లారీ డ్రైవర్. గూగుల్ మ్యాప్స్ లో ముందు దారి కనిపిస్తుంది కదా అని వెళ్తే నీటిలో చిక్కుకోవాల్సి వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలో చిక్కుకుపోయింది ఓ లారీ. అసలేం జరిగిందంటే..
తమిళనాడుకు చెందిన లారీ మంగళవారం రాత్రి చేర్యాల మీదుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వెళ్తోంది. డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్యకు ఆ దారిపై సరైన అవగాహన లేకపోవడంతో.. ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా గమ్యస్థానానికి వెళ్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నందారం స్టేజీ దాటిన తర్వాత గూగుల్ మ్యాప్స్ లో సూటిగా రోడ్డు కనిపించింది. దారి ఉందేమో అనుకుని ఆ లారీ డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. చీకటి కావడంతో చుట్టు పక్కల పరిసరాలు కనిపించకపోవడంతో అలాగే ముందుకు వెళ్లారు. వర్షాలు పడుతున్నాయి కదా రోడ్డుపై నీరు నిలిచాయేమో అనుకున్నారు. మరికొంత ముందుకు వెళ్లగానే లోతు పెరిగింది. క్రమంగా నీరు లారీ క్యాబిన్ వరకు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ముందు భాగం చాలా వరకు నీటిలో మునగడంతో లారీ ఆగిపోయింది. క్యాబిన్ లో ఉన్న శివ, మొండయ్య కిందకు దిగారు. పరిస్థితిని గమనించి లారీ అక్కడే వదిలి సమీపంలోని రామవరం గ్రామానికి వచ్చారు.
గ్రామస్థులకు తమకు జరిగిన పరిస్థితి గురించి, లారీ నీటిలో చిక్కుకోవడం గురించి చెప్పారు. దీంతో ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్, గుటాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డితో పాటు గ్రామ యువకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీకి తాళ్లు కట్టి వెనక్కి లాగడంతో అతికష్టం మీద భారీ వాహనం నీటిలో నుంచి బయటకు వచ్చింది. నందారం స్టేజి వద్ద స్టాపర్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వాహనాలను బైపాస్ రోడ్డు ద్వారా దారి మళ్లించారు. అయితే భారీ వర్షాల వల్ల ఆ స్టాపర్లు పడిపోయాయి. ఎలాంటి సూచిక బోర్డులు లేకపోవడంతో ఆ విషయం తెలియని లారీ డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు.