FRO Srinivasa Rao Death Case: ఎఫ్‌ఆర్ఓ హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO Srinivasa Rao) చళ్ళమళ్ళ శ్రీనివాసరావు హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. అడవులు వ్యవహారాలపై సుప్రీంకోర్టులో “అమైకస్ క్యూరీ” ( న్యాయ సలహాదారు) గా ఉన్న న్యాయవాది ఏడిఎన్ రావు ఈ ఘటనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమనాధ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం వాదనలు విన్నది.
న్యాయవాది ఏడిఎన్ రావు పిటీషన్ దాఖలు చేయడంతో పాటు, ధర్మాసనం ఎదుట వాదనలు కూడా వినిపించారు. ఎఫ్‌ఆర్ఓ శ్రీనివాసరావు హత్య ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని అడవుల వ్వవహారాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన “సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ” ని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది నవంబర్ 23 తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలంలో ఎర్రబోడు అడవుల్లో అటవీ అధికారి శ్రీనివాసరావు పై పోడు భూములు సాగు చేస్తున్న గుత్తి కోయ ఆదివాసుల బృందం దాడి చేసింది. పోడు భూములు విషయంలో తమను అడ్డుకోరాదని హెచ్చరిస్తూనే గుత్తి కోయల బృందం కొడవళ్లు, కత్తులతో ఒక్కసారిగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అటవీ అధికారి మృతి చెందారు. వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సుప్రీంకోర్టు అమైకస్ క్యూరీ సుమోటాగా పిటీషన్ దాఖలు చేసింది.
50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేత..
FRO Srinivasa Rao Death: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు కుటుంబాన్ని స్థానిక నాయకులు, అధికారులు గత నెలలో పరామర్శించారు. ఇటీవల పోడుభూమి సాగుదారుల దాడిలో చనిపోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేశారు. FRO శ్రీనివాస్ రావు భార్య, పిల్లలకు చెక్కు అందజేసిన నేతలు, అధికారులు.. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (CCF) భీమా నాయక్, డీఎఫ్ఓ లు సిద్దార్థ్ విక్రమ్ సింగ్, రంజిత్ నాయక్ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మేయర్ నీరజ చెక్కు అందజేసిన వారిలో ఉన్నారు.
అసలేం జరిగిందంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను పోడుభూమి సాగుదారులు నరుకుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే మొక్కలను నరకవద్దని గుత్తికోయలను హెచ్చరించడంతో పోడుభూమి చేస్తున్న వారు ఆగ్రహం చెందారు. వారు సహనం కోల్పోయి ఒక్కసారిగా వేట కొడవళ్లతో ఫారెస్ట్ రేంజ్ అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫారెస్ట్ రేంజ్ అధికారి తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే తోటి సిబ్బంది ఆయన్ను చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. సాగుభూమిదారులు దాడి చేయడంతో తొలిసారిగా రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతి చెందడంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.