(Source: ECI/ABP News/ABP Majha)
PushPull Train: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - పుష్ పుల్ రైలు పునఃప్రారంభం
PushPull Train: కాజీపేట - డోర్నకల్ - విజయవాడ పుష్ పుల్ రైలును ద.మ రైల్వే అధికారులు పునరుద్ధరించారు. ట్రాక్ మరమ్మతుల కారణంగా 5 నెలల క్రితం రైలు రద్దు చేయగా ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు పునరుద్ధరించారు.
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాజీపేట - డోర్నకల్ - విజయవాడ మధ్య నడిచే పుష్ పుల్ రైలును పునఃప్రారంభించింది. వివిధ చోట్ల ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ రైలును అధికారులు 5 నెలల క్రితం రద్దు చేశారు. దశల వారీగా రద్దు నిర్ణయాన్ని పొడిగించుకుంటూ వచ్చారు. అయితే, సామాన్య ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దీన్ని పునరుద్ధరించారు.
సామాన్య ప్రయాణికుల వినతి
పుష్ పుల్ రైలు రద్దుతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైలును పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గతంలో ద.మ రైల్వే, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్, ఇతర రైల్వే ఉన్నతాధికారులకు పలువురు వినతి పత్రం సమర్పించారు. గార్లలో నిరసనలు తెలిపి రైల్వే శాఖపై ఒత్తిడి చేశారు. దీంతో రైల్వే శాఖ పుష్ పుల్ రైలును పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రయాణికుల హర్షం
5 నెలల విరామం తర్వాత పుష్ పుల్ రైలు పరుగులు తీయడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు ప్రతి రోజూ ఉదయం 6:40 గంటలకు కాజీపేట నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
దసరాకు ప్రత్యేక రైళ్లు
మరోవైపు, దసరా సందర్భంగా 620 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ రైల్వే అధికారులు తెలిపారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్ సహా కాచిగూడ, లింగంపల్లి ఇలా ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య దాదాపు 200 ట్రిప్పులు షెడ్యూల్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. షిర్డీ, జైపూర్, రామేశ్వరం ఇలా రద్దీ ప్రాంతాలకు రైళ్లను నడుపుతున్నట్లు చెప్పారు.
ఈ రూట్స్ లోనే రద్దీ
సాధారణంగా పండుగల సీజన్ లో విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి, విశాఖ సహా వివిధ ప్రాంతాలకు ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కువ మంది ప్రయాణిస్తారని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా రైళ్లను నడపనున్నారు. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు దాదాపు 100 సర్వీసులు అదనంగా నడపనున్నట్లు తెలిపారు.
'భారత్ గౌరవ్ టూరిస్ట్' రైళ్లు
పండుగల సందర్భంగా పుణ్య క్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే 'భారత్ గౌరవ్ టూరిస్ట్' రైళ్లను ప్రవేశ పెట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలలో 2 భారత్ గౌరవ్ రైళ్లు కాశీ, అయోధ్య, పూరీ వంటి పవిత్ర స్థలాలకు నడపనున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు టికెట్ కౌంటర్లు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.