Siddipet News : వావ్ వాట్ యాన్ ఐడియా! రైతు దెబ్బకు కోతులు పరార్!
Siddipet News : కోతులు, అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు సిద్ధిపేట జిల్లాకు చెందిన రైతు వినూత్న ఆలోచన చేశారు. ఈ ఐడియాతో కోతులు పరార్, పంట సేఫ్ అయ్యాయి.
Siddipet News : ప్రకృతి వైపరీత్యాల తర్వాత వన్యప్రాణుల వల్లే రైతులకు అధికంగా పంట నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యకు చక్కని పరిష్కారం కనుగొన్నారు సిద్ధపేట జిల్లాకు చెందిన రైతు. ఎలుగుబంటి ఆకారంలో దుస్తులు ధరించి పొలాలలో తిరుగుతూ కోతులు, అడవి పందుల బారి నుంచి పంటలను రక్షించుకుంటున్నారు. తనతో పాటు చుట్టుపక్కల రైతులకు సాయం చేస్తూ అందరితో వాట్ యాన్ ఐడియా అనిపించుకుంటున్నారు.
ఎలుగుబంటి వేషధారణలో
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే మరోవైపు వన్యప్రాణుల దాడితో రైతులకు పంట నష్టం తప్పడం లేదు. అయితే కోతులు, అడవిపందుల బారి నుండి పంటను రక్షించుకోవడానికి సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల గ్రామానికి చెందిన రైతు భాస్కర్ రెడ్డి వినూత్నంగా ఆలోచించాడు. గ్రామ శివారులో తనకున్న పది ఎకరాల వ్యవసాయ భూమిలో ఐదు ఎకరాల్లో మొక్కజొన్న, మూడు ఎకరాలు బీర, రెండెకరాలు కాకరకాయ పంటను రైతు భాస్కర్ రెడ్డి సాగు చేస్తున్నాడు. పంటకు కోతులు నాశనం చేస్తున్నారు. కోతుల బారి నుంచి పంటను రక్షించుకోవడానికి ఓ వినూత్న ఆలోచన చేశారు. ఎలుగుబంటి వేషధారణలో కోతులను బెదరగొడుతూ పంటను కాపాడుకుంటున్నారు.
(రైతు భాస్కర్ రెడ్డి)
రూ.10 వేలతో ఎలుగుబంటి దుస్తులు కుట్టించి
హైదరాబాదులో ఎలుగుబంటి ఆకారంలో దుస్తులు తయారు చేస్తారని తెలుసుకున్న రైతు భాస్కర్ రెడ్డి హైదరాబాద్ వెళ్లి రూ.10 వేలు వెచ్చించి ఎలుగుబంటి వేషధారణను తయారు చేయించి తీసుకువచ్చారు. ఇప్పుడు ఆ దుస్తులను పంటకు రక్షణగా ఉపయోగిస్తున్నారు. పంటకు రక్షణగా ఉదయం, సాయంత్రం కోతుల గుంపు, అడవి పందులు రాకుండా ఎలుగుబంటి వేషధారణతో కూలీని పెట్టుకొని రోజుకు అతనికి 500 రూపాయలు చెల్లిస్తూ పంటకు కాపలా కాయిస్తున్నారు. రైతు భాస్కర్ రెడ్డి పంటతో పాటు పక్కనే ఉన్న దాదాపు 25 ఎకరాల పంటకు కూడా నష్టం వాటిల్లకుండా ఈ ఎలుగుబంటి వేషధారణ ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఎలుగుబంటి వేషధారణతో కోతులను తరిమితే తిరిగి పది రోజుల వరకు పంటల వైపు రావని రైతులు అంటున్నారు.
Also Read : Piyush Goyal : రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం - ఎఫ్‌సీఐతో తెలంగాణ ఒక్కటే ఒప్పందం చేసుకోలేదన్న పీయూష్ గోయల్