Telangana September 17: సెప్టెంబర్ 17 - తెలంగాణలో హైవోల్టేజ్ రాజకీయం గ్యారంటీ !
తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17 కేంద్రంగా హై వోల్టేజ్ రాజకీయం జరగనుంది. అన్ని పార్టీలు భారీ బహిరంగసభలను ఏర్పాటు చేస్తున్నాయి.
Telangana September 17: తెలంగాణ రాజకీయం ప్రస్తుతం సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతోంది. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెట్టి కేసీఆర్ ను టార్గెట్ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ఆ పార్టీలకు చెక్ పెట్టేలా భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. దీంతో ఒకే రోజు హైదరాబాద్ అన్ని పార్టీలు భారీ కార్యక్రమాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని నిర్వహిస్తామంటున్న బీజేపీ
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడానికి బీజేపీ సిద్ధమైంది. సెప్టెంబర్ 17వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఇక ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, లేదా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సంగ్‌ను ఆహ్వానించే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఒకరు ఖచ్చితంగా వస్తారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్న తెలంగాణ విమోచన దినోత్సవం నాడు, తెలంగాణ సెంటిమెంట్తో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని బీజేపీ భావిస్తుంది. గత ఏడాది అనూహ్యంగా కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించింది. హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
సిడబ్ల్యూసీ సమావేశాల తర్వాత కాంగ్రెస్ బహిరంగసభ
తెలంగాణలో ఈనెల 16, 17 తేదీలలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకుంది. కానీ అక్కడే బీజేపీ సభ నిర్వహించాలనుకుంటోంది కాబట్టి కాంగ్రెస్ కు అనుమతులు దొరకవు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే అవకాశం ఉంది. అయితే భారీ జన సమీకరణ చేయాలనకుంటున్నందున శివారు ప్రాంతాల్లో ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేయాలన్న ఆలోనచకు వస్తున్‌నట్లగా తెలుస్తోంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలంతా హాజరవుతారు. అంటే ఒకే రోజు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ బహిరంగసభలు జరగనున్నాయి.
కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్ కూడా రెడీ
తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి, తెలంగాణలో తమ సత్తా చాటి, పట్టు నిలుపుకునే ప్రయత్నం రెండు పార్టీలు చేయనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రూట్ మార్చారు. బీజేపీ, కాంగ్రెస్ సభలకు కౌంటర్ సభగా బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది .సెప్టెంబరు 17 లేదా 18వ తేదీన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది.