TSPSC Case Update : ఐదుగురికి లీకైన గ్రూప్ 1 పేపర్ - సిట్ దర్యాప్తుతో వెలుగులోకి కీలక విషయాలు !
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
TSPSC Case Update : టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రూప్ 1 పేపర్ మొత్తం ఐదుగురికి లీకైందని గుర్తించారు. కీలక నిందితుడు ప్రవీణ్ తాను గ్రూప్ వన్ పరీక్ష రాస్తున్నందున తన కోసం పేపర్ తస్కరించాడని సిట్ గుర్తించింది. తర్వాత ఆ పేపర్ ఐదుగురి చేరినట్లుగా అనుమానిస్తున్నారు. నాంపల్లి కోర్టు అనుమతితో షమీమ్, రమేశ్, సురేశ్‌లను సిట్ అధికారులు చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు. కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం హిమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయానికి నిందితులను తీసుకొచ్చారు.
వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు
గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో షమీమ్‌కు 126 మార్కులు, రమేశ్‌కు 122, సురేశ్‌కు 100కు పైగా మార్కులచ్చాయి. రాజశేఖర్, ప్రవీణ్‌ల ద్వారా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ముగ్గురు నిందితులు తీసుకున్నట్లు సిట్ అధికారులు ఇప్పటికే తేల్చారు. ఈ ముగ్గురి ద్వారా ఇంకెవరికైనా ప్రశ్నపత్రం వెళ్లిందా? అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ముగ్గుర్నీ వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. నేటి నుంచి 5రోజుల పాటు ముగ్గురు నిందితులను సిట్ అధికారులు విచారించనున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులనూ గత వారం రోజులుగా సిట్ కార్యాలయానికి అధికారులు పిలిచి వివరాలు సేకరిస్తున్నారు.
అత్యధిక మార్కులు వచ్చిన వారిని ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్న సిట్
18 అంశాలతో కూడిన పత్రాన్ని ఇచ్చి దాన్ని నింపి ఇవ్వాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థులు ఆ పత్రాలను నింపి సిట్ అధికారులకు ఇచ్చి వెళ్తున్నారు. గతంలో ఎన్నిసార్లు టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్లారు? ఒకవేళ వెళ్తే అక్కడ ఎవరెవర్నీ కలిశారు? అభ్యర్థులు ఎక్కడ శిక్షణ తీసుకున్నారు? వారి చిరునామా, కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. ఏఈ పేపర్ లీకేజీలో ప్రవీణ్, రాజశేఖర్‌తోపాటు రేణుక భర్త ఢాక్య నాయక్, రేణుక తమ్ముడు రాజేశ్వర్ నుంచి సిట్ కీలక సమాచారం రాబట్టింది. ఈ నలుగురి కస్టడీ మంగళవారంతో ముగియడంతో కోర్టులో ప్రొడ్యుస్ చేసింది. కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌కు తరలించింది. కస్టడీ సందర్భంగా నలుగురిని సిట్ విడివిడిగా ప్రశ్నించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. తర్వాత అందరినీ కలిపి విచారించింది.
ప్రవీణ్ , రాజశేఖర్ హ్యాక్ చేసిన ఆరు పేపర్ల వివరాలను సిట్ అధికారులు రాబట్టారు.అక్టోబర్‌లో జరిగిన గ్రూప్1 ప్రిలిమ్స్ పేపర్ లీక్ బయటపడకపోతే ఏఈ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, మరో మూడు పేపర్లు లీక్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. రేణుక, ఆమె భర్త ఢాక్యానాయక్, తమ్ముడు రాజేశ్వర్ కలిసి సేల్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఆధారాలు సేకరించారు. వీరిచ్చిన సమాచారంతో మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్‌కు చెందిన ప్రశాంత్‌రెడ్డి, షాద్‌నగర్ నేరెళ్లచెరువుకు చెందిన రాజేంద్రకుమార్, సల్కర్‌పేట్‌కు చెందిన తిరుపతయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.