Sangareddy News: కోళ్ల ఫారంలో పాడు పని! పెద్ద సెటప్‌తో ఆర్నెల్లుగా డ్రగ్స్ తయారీ
Telangana News: ఓ పల్లెటూరులోని కోళ్లఫారంలో నిందితులు నిషేధిత మత్తుపదార్థాల తయారీని చేపట్టారు. ఎవరికి అనుమానం రాకుండా గత ఆర్నెలుగా దందా కొనసాగిస్తున్నారు.
Sangareddy Drugs News: డ్రగ్స్ తయారీ, చెలామణిని అరికట్టేందుకు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ డబ్బుల మోజులో పడి కొందరు డ్రగ్స్ తయారీ సహా, చెలామణిని వదలడం లేదు. తాజాగా మారుమూల ప్రాంతంలోనూ మత్తు పదార్థాల ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అందులోనూ ఓ కోళ్లఫారంలో పెద్ద సెటప్ పెట్టి అక్కడ నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేస్తుండడం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.
మారుమూల ప్రాంతంలో గుట్టుగా నడిపిస్తున్న అల్ఫ్రాజోలం అనే మాదకద్రవ్యాల తయారీ కేంద్రంపై తెలంగాణ న్యాబ్, సంగారెడ్డి, గుమ్మడిదల పోలీసులు సంయుక్తంగా సోదాలు చేసి వారి గుట్టు రట్టు చేశారు. మంగళవారం (జూన్ 19) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి అనే గ్రామంలో కోళ్ల ఫారాలు ఉన్నాయి. ఈ ఫారాలనే మత్తు పదార్థాల తయారీ కేంద్రంగా నిందితులు మలచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీని వెనక ఉన్న వారి వివరాలను జిల్లా ఎస్పీ రూపేష్ వివరించారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తపల్లికి చెందిన ప్రభాకర్ గౌడ్ తన గ్రామంలో కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నాడు. ఈయనతో పాటుగా గోసుకొంద అంజి రెడ్డి (గుమ్మడిదల గ్రామ నివాసి), సాయి కుమార్ గౌడ్(అనంతారం నివాసి), క్యాసారం రాకేష్ (వికారాబాద్ జిల్లా పంచలింగాల నివాసి)లతో కలిసి గత 6 నెలలుగా నిషేధిత మత్తు పదార్థం అయిన అల్ఫ్రాజోలాన్ని కోళ్ల ఫారంలో తయారు చేస్తున్నారు. ముడి సరకు తెచ్చే పనిని సాయి కుమార్ గౌడ్ చూసుకుంటుండగా.. అందుకు పెట్టుబడి అంజిరెడ్డి నుంచి వచ్చేది. రాకేష్ కెమిస్ట్ గా వ్యవహరిస్తూ మత్తు పదార్థాలను తయారు చేసేవారు.
ప్రభాకర్ గౌడ్ ఈ సరకును తీసుకెళ్లి కల్లు దుకాణాల్లో అమ్మేవాడు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం గురించి సమాచారం తెలుసుకున్న న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, సీఐ సంతోష్‌ల టీమ్ సోమవారం (జూన్ 18) అర్ధరాత్రి తయారీ కేంద్రంపై దాడి చేసింది. అలా మొత్తం రూ.40 లక్షల విలువైన 2.60 కిలోల అల్ఫ్రాజోలంను తయారీ కేంద్రంలో గుర్తించారు. అక్కడ మొత్తం రూ.60 లక్షల విలువైన ముడి పదార్థాలను స్వాధీనం చేసుకుంది. తయారీ కోసం వాడుతున్న సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వెంటనే నిందితులు అంజిరెడ్డి, రాకేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభాకర్ గౌడ్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. వీరిలో సాయికుమార్ గౌడ్ ఓ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నట్లుగా ఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు.
The #TGNAB, in coordination with #Gummadidala Police, Sangareddy district, apprehended two drug manufacturers and seized 2.6 kg of #Alprazolam and a complete manufacturing lab with equipment, valued at ₹1 crore: @TS_NAB @hydcitypolice @TelanganaCOPs#Drugs #Hyderabad pic.twitter.com/yfOAG9QPMI
— Glint Insights Media (@GlintInsights) June 19, 2024