Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి మెగా ప్లాన్! ఇప్పటికే అమల్లోకి.. సక్సెస్ అవుతుందా?
వచ్చే ఎన్నికలలోపు ప్రజలకు ఎలా దగ్గర కావాలన్న అంశంపైనే పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో ప్రజల నాడి తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రజలు ఏమనుకుంటున్నారో, వారి ధోరణి ఎలా ఉందో కచ్చితంగా అంచనా వేసే ప్రయత్నం చేసి తదనుగుణంగా రాజకీయంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలోపు ప్రజలకు ఎలా దగ్గర కావాలన్న అంశంపైనే పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపై రేవంత్ రెడ్డి తాను సొంతంగా ఏర్పాటు చేసిన టీంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
దేశం, రాష్ట్రంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడమే లక్ష్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఏజెన్సీలతో ఈ సర్వే జరుపుతున్నారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. సర్వేలో భాగంగా తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ గురించి ప్రజలు ఏమని అనుకుంటున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ పార్టీలపై రాష్ట్ర ప్రజల అభిప్రాయమే లక్ష్యంగా ఈ సర్వే సాగుతున్నట్లుగా సమాచారం.
మొత్తానికి దేశంలో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి? ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎలా దగ్గరవుతోంది? ప్రజల తక్షణ అవసరాలు ఏంటి? కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్‌ఎస్, అలాగే కాంగ్రెస్‌పై ప్రజల అభిప్రాయం ఏంటి? పెరుగుతున్న ధరలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల గురించి ప్రజలు ఏమని అనుకుంటున్నారు? అనే అంశాలపై నియోజకవర్గాల వారీగా సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఇప్పటివరకు పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల పంథాలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందా? అనే దానిపై అవగాహన కోసమే రేవంత్ అండ్ టీం ఈ సర్వేకు పూనుకున్నట్టు తెలుస్తోంది.
సర్వే తర్వాత వచ్చే నివేదికలతో.. ప్రజల మనసులు గెలుచుకుని అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి అడుగులు వేయాలన్న దానిపై స్పష్టత వస్తుందని, దానికి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేది రేవంత్ ఆలోచన అని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. సర్వే సమాచారాన్ని తన పాదయాత్రకు ఫీడ్‌బ్యాక్‌గా ఉపయోగించుకునే వ్యూహంతోనే రేవంత్ సర్వేకు శ్రీకారం చుట్టారని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటున్నాయి.