Maruti Grand Vitaraపై ఇయర్ ఎండ్ ఆఫర్లు: పెట్రోల్, CNG వేరియంట్లకూ డిస్కౌంట్లు
మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ వేరియంట్లపై, ఈ డిసెంబర్ నెలలో రూ.2.13 లక్షల వరకు లాభాలు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, CNG మోడళ్లకూ ఇయర్ ఎండ్ ఆఫర్లు వర్తిస్తాయి.

Maruti Grand Vitara Year End Offers 2025: ఇయర్ ఎండ్ దగ్గరపడిన వేళ, మారుతి సుజుకి గ్రాండ్ విటారా కొనాలనుకునే వారికి కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. ఈ నెల (డిసెంబర్ 2025) ముగిసేలోగా గ్రాండ్ విటారా కొనేవాళ్లకు ఇయర్ ఎండ్ ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై రూ.2.13 లక్షల వరకు మొత్తం లాభాలు లభించడం ఈ ఆఫర్లలో ప్రధాన ఆకర్షణ.
మారుతి సుజుకి–టయోటా కలిసి అభివృద్ధి చేసిన ఈ మిడ్‌సైజ్ SUV భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. పెట్రోల్, CNG, స్ట్రాంగ్ హైబ్రిడ్ వంటి మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో గ్రాండ్ విటారా పెద్ద కస్టమర్ బేస్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ ఆఫర్లతో, కొనుగోలుదారులకు మరింత వాల్యూ ఫర్ మనీగా మారింది.
హైబ్రిడ్ వేరియంట్లపై గరిష్ట లాభాలు
ఈ డిసెంబర్ ఆఫర్లలో స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లకే అత్యధిక ప్రయోజనం లభిస్తోంది. వేరియంట్‌ను బట్టి క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్, కార్పొరేట్ లేదా డీలర్ లెవల్ స్కీమ్స్ రూపంలో ఈ లాభాలు అందిస్తున్నారు. కొన్ని డీలర్‌షిప్‌ల్లో ఎక్స్‌టెండెడ్ వారంటీ లేదా యాక్సెసరీ ప్యాకేజీలు కూడా అదనపు ప్రయోజనంగా ఇస్తున్నారు.
హైబ్రిడ్ మోడళ్లకు మాత్రమే కాకుండా, పెట్రోల్ & CNG వేరియంట్లపైనా 1 లక్ష రూపాయలకు పైగా లాభాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, గ్రాండ్ విటారాలో ప్రత్యేకంగా ఉండే AllGrip ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ కూడా ఈ ఇయర్ ఎండ్ స్కీమ్ పరిధిలోకి రావడం విశేషం.
డీలర్‌ను బట్టి డిస్కౌంట్
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం... ఈ ఆఫర్లు నగరం, డీలర్‌ను బట్టి మారే అవకాశం ఉంది. అందుకే ఆసక్తి ఉన్న వారు తమకు సమీపంలోని నెక్సా డీలర్‌షిప్‌ను సంప్రదించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడం మంచిది. స్టాక్ లభ్యతను బట్టి కూడా ఆఫర్లు కొంత మారవచ్చు.
గ్రాండ్ విటారా ధరలు
తెలుగు రాష్ట్రాల్లో, మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్ ధర రూ.10.77 లక్షల నుంచి రూ.19.72 లక్షల వరకు ఉంటుంది. ఈ ధర శ్రేణిలో హైబ్రిడ్ టెక్నాలజీ, మంచి మైలేజ్, ఆధునిక ఫీచర్లు అందించడం గ్రాండ్ విటారాను ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ఎంత మైలేజ్ ఇస్తుంది?
ఇంధన సామర్థ్యమే గ్రాండ్ విటారా ప్రధాన బలం.
- స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ మైలేజ్: 27.97 కిలోమీటర్లు/లీటర్
- నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్: 21.11 కిలోమీటర్లు/లీటర్
- పెట్రోల్ ఆటోమేటిక్: 20.58 కిలోమీటర్లు/లీటర్
- AllGrip AWD వేరియంట్: 19.20 కిలోమీటర్లు/లీటర్
ఈ సెగ్మెంట్‌లో ఈ స్థాయి మైలేజ్ గ్రాండ్ విటారాకు పెద్ద ప్లస్ పాయింట్.
ఇంజిన్, సాంకేతికలు
గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది.
మొదటిది 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది 101.5 bhp శక్తి, 137 Nm టార్క్ ఇస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. ఈ ఇంజిన్‌తో పాటు AllGrip ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది.
రెండోది 1.5 లీటర్ మూడు సిలిండర్ల అట్‌కిన్సన్ సైకిల్ హైబ్రిడ్ ఇంజిన్. ఇది 90 bhp శక్తి, 122 Nm టార్క్ ఇస్తుంది. దీనికి 79 bhp, 141 Nm టార్క్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్ జత అవుతుంది. మొత్తం కలిపి 109 bhp శక్తిని అందిస్తుంది. ఈ హైబ్రిడ్ సిస్టమ్‌కు e-CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. మెరుగైన రెస్పాన్స్‌తో పాటు అద్భుతమైన ఇంధన సామర్థ్యం దీని ప్రత్యేకత.
మొత్తం మీద, మారుతి గ్రాండ్ విటారా కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ టైమ్ అవుతుంది. భారీ డిస్కౌంట్లు, హైబ్రిడ్ టెక్నాలజీ, నమ్మకమైన మారుతి బ్రాండ్ బ్యాక్‌అప్‌తో ఈ SUV ఇయర్ ఎండ్ డీల్స్‌లో ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















