Telangana News : కంటతడి పెట్టుకున్న రేవంత్ - భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఈటలపై ఏమన్నారంటే ?
భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. కేసీఆర్ పై పోరాడే వారిని ఈటల రాజేందర్ కించ పరుస్తున్నారని మండిపడ్డారు.
Telangana News : బీజేపీ నేత ఈటల రాజేందర్ తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేశారని.. ఏ ఆధారం లేని వారికి దేవుడే ఆధారమని.. అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రమాణం చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. అమ్మవారి సాక్షిగా చెబుతున్నా.. మునుగోడు ఉపఎన్నికల్లో కేసీఆర్ వద్ద నుంచి తాము ఒక్క రూపాయి తీసుకున్నా సర్వనాశనం అయిపోతామన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వందల కోట్లు ఖర్చుపెట్టాయన్నారు. ఒక్క మద్యం అమ్మకాలే మూడు వందల కోట్లు నమోదయ్యాయన్నారు. అమ్మవారి కండువా వేసుకుని ప్రమాణం చేస్తున్నానని.. చివరి రక్తపు బొట్టు వరకూ కేసీఆర్ తో పోరాడుతానన్నారు. గర్భగుడిలో ప్రమాణం చేసి చెబుతున్నానని కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ లేదన్నారు.
ఈటలలా నోటీసులకే భయపడి లొంగిపోలేదని మండిపడ్డ రేవంత్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికల్లో పాల్వాయి స్రవంతి ఒక్క రూపాయి పంచకుండా ఎన్నికల్లో పాల్గొన్నారన్నారు. రూపాయి కూడా పంచకపోయినా పాల్వాయి స్రవంతికి పాతికవేలు ఓట్లు వచ్చాయన్నారు. అసలు ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా పంచకుండా.. ప్రచారం చేయకండా.. నామినేషన్లు వేసి నిర్ణయాన్ని ఓటర్లకు వదిలేద్దామని పాల్వాయి స్రవంతి చేసిన సవాల్‌కు బీజేపీ, బీఆర్ఎస్ స్పందించలేదన్నారు. మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ పాతిక ఎకరాల్లో జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకుంటే తాను పోరాడానని.. ఒక్క బీజేపీ నేత కూడా స్పందించలేదన్నారు.
చేతకాని తనంతో కాదని ఆవేదనతోనే కన్నీరు పెట్టానన్నరేవంత్
భయం అనేది తన ఇంట్లోనే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం ముందు ఈటల తల వంచుకునే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ఈటల ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారన్నారు. కేసీఆర్ వ్యతిరేక గొంతులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు రాగానే నీలా భయపడి లొంగిపోేలదని.. చిప్పకూడు తింటే ఆ పరిస్థితి తెలుస్తుందన్నారు. తనకు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని కరుడు గట్టిన నేరస్తులు ఉండే డిటెన్షన్ సెంటర్‌లో పెట్టారన్నారు. కేసీఆర్ పై విమర్శలు చేసే వారి మీద ఈటల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు సరి కాదన్నారు. అందరితో మాట్లాడినట్లుగా తనతో మాట్లాడవద్దని ఈటల రాజేందర్‌కు సూచించారు. చేతకాని తనంతో కన్నీరు పెట్టలేదని.. ఆవేదనతోనే కన్నీరు పెట్టారన్నారు. ఈటల రాజేందర్ పై తనకు కొంత అభిమానం ఉండేదన్నారు. ఈటల రాజేందర్ తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని స్పష్టం చేశారు.
కేసీఆర్‌తో కొట్లాడటానికి జీవితాన్ని ధారబోస్తున్నాం !
కేసీఆర్‌తో కొట్లాడటానికే మా జీవితాలు ధారేపోస్తున్నామని.. నన్ను అమ్ముడుపోయారని అంటావా అని ఈటలపై మండిపడ్ారు. కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు..ఇది చిల్లర రాజకీయం కాదు.. పోరాటమని రేవంత్ స్పష్టం చేశారు. నా నిజాయితీని శంకిస్తే మంచిది కాదు.. రేవంత్ రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదన్నారు. నేను ఎవరికీ భయపడను.. నిటారుగా నిలబడి కొట్లాడుతా
నా జీవితంలో అన్నీ ఉన్నాయి.. నా ఏకైక లక్ష్యం.. కేసీఆర్ ను గద్దె దించడమేనని స్పష్టం చేశారు.
ఆత్మసాక్షిగానే మాట్లాడాను.. ఎవరినీ కించపర్చలేదన్న ఈటల
మరో వైపు ఈటల రాజేందర్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకురాలేదు. నిజానికి ఈ వివాదాన్ని ఆయన సీరియస్ గా తీసుకోలేదు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లలో ఉన్నారు రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అలయానికి బయలుదేరిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తాను ఎవరినీ కించ పరచలేదనిస్పష్టం చేశారు. తనదిఅలాంటి వ్యక్తిత్వం కాదన్నారు. తాను ఆత్మసాక్షిగానే మాట్లాడానని ఆధారాలు చూపలేనని ఈటల చెప్పుకొచ్చారు. కేసీఆర్‌పై పోరాడలేదని తాను అనలేదన్నారు. గుళ్లకు వెళ్లి అమ్మతోడు.. అయ్య తోడు అనడం ఏమిటన్నారు. నిజమెంతో.. అబద్దం ఎంతో ప్రజలే తేలుస్తారన్నారు.