Revant Reddy : ఆ బాలింతల మృతి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే - రూ. కోటి పరిహారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కొత్తగా అమ్మ అయిన మహిళలు మృతి చెందడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
Revant Reddy : వైద్యం వికటించి మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రి లో ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటన అత్యంత దారుణమని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ నిర్లక్షానికి పరాకాష్ట అని విమర్శించారు. మలక్ పేట ఆసుపత్రిలో కల్వకుర్తి కి సిరివెన్నెల, సైదాబాద్ కు చెందిన శివాని లు చికిత్స పొందుతూ వైద్యం వికటించి మృత్యువాత పడ్డారని.. హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం బాలింతలను కాపాడలేకపోతోందని విమర్శించారు. ప్రభుత్వ వైద్యంలో తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ప్రభుత్వ వైఖరి వల్లనే ప్రైవేట్ వైద్యం ఇక్కడ అభివృద్ధి చెందుతోందని విమర్శించారు.
ప్రచారానికే ప్రభుత్వం పరిమితమైందని రేవంత్ విమర్శ
ప్రపంచ స్థాయి అని చెప్పుకుంటున్న హైదరాబాద్ లో ఇంత ఘోరమా ? ప్రభుత్వ వైద్యం పై పూర్తిగా నమ్మకం పోతోందని.. ఇబ్రహీంపట్నం లో కుటుంబ నియంత్రణ అపరేషన్ లో ఆపరేషన్ వికటించి 4 గురు బాలింతలు చనిపోయారని గుర్తు చేశారు. ఆగస్టు చివరి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి బాలింతలు మృత్యువాత పడ్డారు.4 నెలల్లోనే మళ్ళీ ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్ లోనే ఇలా ఉంటే ఇక మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ప్రజలకు భయం వేస్తోందని.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాటలకే పరిమితం అయ్యారని మండిపడ్డారు. ఈ సంఘటనకు ఆయనే బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమండ్ చేశారు. మృత్యువాత పడ్డ పేద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే ?
మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు బాలింతలు మృతి చెందినట్టు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై గాంధి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాలింతలు చనిపోయారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఛాదర్ ఘాట్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అనంతరం మలక్ పేట ఏరియా ఆసుపత్రి ముందు బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు.
ఆస్పత్రి తప్పిదమేమీ లేదంటున్న వైద్యులు
ఈ ఘటపై మలక్ పేట ఆస్పత్రి సూపరింటెడెంట్ స్పందించారు. ఇద్దరు బాలింతలకు ఈ నెల 11 న సిజేరియన్ చేశామన్నారు. అందులో ఓ మహిళకు12న 4 గంటలకు... హార్ట్ రేట్ పడిపోయిందని, వెంటనే గాంధీకి రిఫర్ చేశామన్నారు. ఆమె గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందిందని చెప్పారు. ఇంకో మహిళకు అప్పటికే హైపో థైరాడిజం ఉండడంతో... 12న రాత్రి షుగర్ లెవల్స్ పడిపోవడంతో గాంధీకి తరలించారని, ఆమె కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందిందని తెలిపారు. ఈ కేసుల్లో వైద్యుల నిర్లక్ష్యం లేదని, ఆపరేషన్ కి ముందు అన్ని పరీక్షలు చేశామని చెబుతున్నారు.