Revanth Reddy: కేసీఆర్ అడిగింది లేదు, మోదీ ఇచ్చిందీ లేదు - రేవంత్ రెడ్డి
Revanth Reddy Press Meet: పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించామని రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy on KCR: తెలంగాణ ప్రజల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హక్కులను కాపాడలేని అన్నారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి కేసీఆర్ ఏనాడు ప్రధాని మోదీని అడగలేదని.. అందుకే ఆయన ఇవ్వలేదని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించామని అన్నారు. అందుకోసం సెలక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఏకంగా వంద లక్షల కోట్ల అప్పులు చేశారు. మణిపూర్ లో విధ్వంసం జరిగితే కనీసం ఆ పర్యటనకు మోదీ వెళ్లలేదు. కానీ, రాహుల్ గాంధీ మాత్రం మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకూ భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నారు. ఆయన అవసరం దేశానికి చాలా అవసరం ఉంది. ఆయన ప్రధాని అవ్వాలంటే.. తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే అవుతుంది. బీఆర్ఎస్ ను, బీజేపీని నిలువరించేది కాంగ్రెస్ పార్టీనే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రాష్ట్రం ప్రయోజనాలను ఏనాడూ కేంద్రాన్ని అడగలేదు. అందుకే మోదీ ఇవ్వలేదు.
రాజకీయ కుట్రతో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్నారు. కేసీఆర్ దొడ్లో చెప్పులు మోసేవారితో ప్రొఫెసర్ కోదండరామ్ ను పోల్చుతున్నారు. కోదండరాం గొప్పదనాన్ని ప్రశ్నించడం.. బీఆర్ఎస్ పార్టీ బావదారిద్య్రాన్ని చాటుతోంది’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
‘‘అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను ఖర్గే, ఏఐసీసీకి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశాము. లోక్ సభలో పోటీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మార్చి 3వ తేదీ వరకు లోక్ సభ సీటు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్క్రూటినీ కోసం ప్రత్యేక కమిటీ వేయడం జరిగింది. 17 పార్లమెంట్ సెగ్మెంట్ లకు మంత్రులను, ఇంచార్జీలను నియమించాము. దేశ ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ విఫలం అయ్యారు. ప్రపంచంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దేశంగా ఇండియా అవ్వడం మోదీ ఘనతే. రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చెయ్యలేదు. దేశ ప్రజల మీద వంద లక్షల కోట్ల అప్పులు చేసి మోపారు. మణిపూర్ లో అంతటి హింసా ఘటన జరిగితే మోదీ అక్కడికి వెళ్ళలేదు. దేశానికి బీజేపీ ప్రమాదకరంగా మారింది’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.