Revanth Reddy: కల్వకుర్తికి సీఎం రేవంత్ రెడ్డి వరాలు, తాను చదువుకున్న స్కూల్‌కు సైతం రూ.5 కోట్లు ప్రకటన
Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లలో పర్యటించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి రూ.309 కోట్లు నిధులు ఇస్తామని ప్రకటించారు.
Revanth Reddy announces Rs 309 crores to development for Kalwakurthy | కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లులు కురిపించారు. కల్వకుర్తి అభివృద్ధికి ఏకంగా రూ. 309 కోట్లు ప్రకటించారు. తాను చదువుకున్న తాండ్ర పాఠశాలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రూ.50 లక్షలు అడిగినట్లు పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. రూ. 5 కోట్లు ఇచ్చి ఆ పాఠశాలను అభివృద్ది చేపిస్తా అని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కొట్ర చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కల్వకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
కల్వకుర్తిలో 50 పడకల మెటర్నిటి అండ్ చైల్డ్ (MCH) ఆసుపత్రికి రూ.22 కోట్లు ప్రభుత్వం ఇవ్వనుంది. దాంతో పాటు ఆమనగల్ లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు రూ.10 కోట్లు నిధులు, రూ.163 కోట్ల వ్యయంతో నాలుగు R&B రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. కల్వకుర్తి పట్టణంలో R&B గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.5 కోట్లు, ఐదు హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 15 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ.78 కోట్లు, మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.3 కోట్లు కేటాయించనున్నారు. మాడ్గుల మండల కేంద్రంలో భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.7.75 కోట్ల నిధులు ఖర్చు పెట్టనుంది తెలంగాణ సర్కార్.
ఈ నెలాఖరులోపు రూ.1.5 లక్షల రుణమాఫీ
రెండో విడత కింద జూలై 31 లోపు రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను ఆగస్ట్ 2 నుండి 14వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక.. ఆగస్ట్ నెలలోనే హామీ ఇచ్చినట్లుగా రూ. 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని కల్వకుర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
కల్వకుర్తి బహిరంగ సభలో రేవంత్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు... నేను ఎప్పటికీ మీ నల్లమల బిడ్డను. మీ సోదరుడిగానే ఉంటా. నమ్మిన సిద్ధాంతం ప్రకారం జైపాల్ రెడ్డి రాజకీయాలు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా... చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉన్నారు. జైపాల్ రెడ్డి పదవులకే గౌరవం తెచ్చేలా వ్యవహరించారు. రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జైపాల్ రెడ్డి. కల్వకుర్తి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారిందని ఆనాడు జైపాల్ రెడ్డి బాధపడ్డారు. జైపాల్ రెడ్డి సూచన మేరకే ఆనాడు తలుపులు మూసి, లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఆనాడు సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించింటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది.
కాంగ్రెస్ మాట ఇస్తే చేసి తీరుతుంది. చెప్పిన ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి తీరుతాం. కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి, ఆర్ అండ్ బీ రోడ్లు, గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం నిధులు ఇస్తున్నాం. ముచ్చెర్ల ప్రాంతంలో ఆగస్టు 1న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం. అధికారం కోల్పోయిన బాధ బీఆరెస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్షం తన బాధ్యత సరిగ్గా నిర్వహించి ఉంటే కనీసం పంచాయతీ ఎన్నికల్లోనైనా ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రజలు వారికి అవకాశం ఇవ్వరు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని’ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.