Medak News: పాఠశాలలో ఎలుకల స్వైర విహారం - విద్యార్థినులకు గాయాలు, మెదక్ జిల్లాలో ఘటన
Telangana News: మెదక్ రామాయంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఎలుకల స్వైర విహారంతో 12 మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించగా.. తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
Rats Bite Girl Students In Ramayampeta Residential School: మెదక్ (Medak) జిల్లా రామాయంపేట (Ramayampeta) సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. తొమ్మిదో తరగతి చదువుతోన్న 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం సిబ్బందికి తెలియజేయగా వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో ఆస్పత్రికి తరలివెళ్లారు. దీనిపై పాఠశాల యాజమాన్యాన్ని అడిగినా ఎవరూ స్పందించలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో ఎలుకలు సంచరిస్తూ.. పిల్లలు నిద్రిస్తోన్న సమయంలోనే కొరుకుతున్నాయని.. ప్రిన్సిపాల్‌కు విద్యార్థినులు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు. పాఠశాల ఆవరణలోనే కుక్కలు కూడా విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని.. ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయి అపరశుభ్రంగా ఉంటోందని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కాగా, ఇటీవలే సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలంలోని సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు వడ్డించే అల్పాహారంలో చట్నీలో ఎలుక తిరుగుతూ కనిపించడం కలకలం రేపింది. దీన్ని కొందరు విద్యార్థులు ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలు, హోటళ్లలో తనిఖీలు సైతం నిర్వహించాలని నిర్దేశించారు.