Ramoji Rao: ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు - ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు
Hyderabad News: మీడియా దిగ్గజం రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Ramoji Rao Last Rites: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramojirao) అంత్యక్రియలు జూన్ 9న (ఆదివారం) నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో (Ramoji Film City) ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన పార్ధీవ దేహాన్ని ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిల్మ్ సిటీకి తరలివచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అటు, ఈనాడు సంస్థల ఉద్యోగులు, సిబ్బంది సైతం ఆయన పార్ధీవ దేహానికి నివాళి అర్పించారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహా ఇతర ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, అనారోగ్యంతో బాధ పడుతోన్న మీడియా దిగ్గజం రామోజీరావు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
అధికారిక లాంఛనాలతో..
ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. రామోజీ రావు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.