Cyber Crime : మీరు సైబర్ మోసానికి గురయ్యారా? టైం వేస్ట్ చేయకుండా ఇలా చేయండి?
Cyber Crime : మీరు సైబర్ నేరాలకు గురైతే చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? సైబర్ క్రైమ్ మోసాలకు గురికాకుండా పాటించాల్సిన సూచనలు ఏంటో తెలుసా?.
Cyber Crime : మీరు సైబర్ క్రైమ్ బారిన పడ్డారా? ఆన్‌లైన్‌లో మోసపోయారా? అయితే మీరు మొదట చేయాల్సింది ఏంటో తెలుసా? మిమల్ని న్యూడ్ చాట్‌లకు ఆహ్వానిస్తారు. ఆ తర్వాత వీడియోలు తీసి బెదిరిస్తారు. అలాంటి సమయాల్లో ఏంచేయాలో తెలుసా? సైబర్ మోసాలకు గురైతే ముందుగా టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయమంటున్నారు పోలీసులు. రామగుండం కమిషనరేట్ పరిధిలో జూన్ 30వ తేదీ వరకు ఈ ఏడాదిలో 128 సైబర్ క్రైమ్ కేసులలో 14,84,488 రూపాయల నగదును సైబర్ నేరగాళ్ల చేతికి పోకుండా ఫ్రీజ్ చేశారు.
హెల్ప్ లైన్ నంబర్
తెలంగాణ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (T4C) జూన్ 2021 నుండి 24/7 కాల్ సెంటర్‌ను నడుపుతోంది. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ (1930)లో ప్రజల సైబర్ మోసం ఫిర్యాదులకు స్పందిస్తూ తక్షణ చర్యలు చేపడుతోంది. ప్రజలు సైబర్ మోసాలను గుర్తించిన వెంటనే ఆ మోసాన్ని ఫిర్యాదు చేసినట్లు అయితే సైబర్ మోసగాళ్లుకు ఆ డబ్బు అందకుండా వారి ఖాతాలలోని బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది సమయంపై ఆధారపడి ఉంది కాబట్టి, ప్రజలు ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగినప్పుడు 1930కి కాల్ చేసి లేదా NCRPలో www.cybercrime.gov.inలో సమయాన్ని వృథా చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడం చాలా కీలకం.
క్లిక్ చేస్తే చాలు డబ్బు మాయం
అలాగే చేతిలో మొబైల్ (Mobile) ఉంది కదా అని ఇష్టం వచ్చిన లింకులన్నీ ఓపెన్ చేస్తే మీ జీవితాలు తల్లకిందులు అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మొబైల్ లో ఇంటర్నెట్ వాడుకునేటప్పుడు మీ స్క్రీన్ మీద అనవసర లింక్‌లను పొరపాటున క్లిక్ చేయకుండా ఉండడమే మంచిది. తెలియక పొరపాటున ఒక్క క్లిక్ చేస్తే చాలు మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు క్షణాల్లో మాయమవుతుంది. అంతేకాదు మీ మొబైల్‌లో ఉన్న ప్రైవేట్ డేటా మొత్తం సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. గుర్తు తెలియని నెంబర్ నుంచి చాట్ చేసిన, వీడియో కాల్ చేసిన స్పందించకండని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.
పలు కేసుల్లో డబ్బు ఫ్రీజ్
జన్నారం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితురాలు తన తండ్రికి మెడికల్ ఇన్సూరెన్స్ తో ఒక సర్జరీ చేయించింది. ఆ విషయం తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు బాధితురాలికి కాల్ చేసి మీకు ఇన్సూరెన్స్ క్లైమ్ అయింది. డబ్బులు మీకు పంపుతామని, ఫోన్ పే లో ఒక రిక్వెస్ట్ వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు అకౌంట్ లో పడతాయని నమ్మించారు. బాధితురాలు సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా చేసింది. డబ్బులు బాధితురాలు అకౌంట్లో పడకపోగా ఆమె ఖాతా నుంచి రూ.30 వేలు కట్ అయ్యాయి. మోసపోయానని గుర్తించి యువతి సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఫిర్యాదు చేసింది. దీంతో బ్యాంకు రూ.30 వేలు సైబర్ నేరగాడి చేతిలోకి పోకుండా ఫ్రీజ్ చేశారు.
సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే
1. తెలియని నెంబర్ నుంచి వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో వీడియో కాల్ వస్తే యాక్సెప్ట్ చేయకండి.
2. కస్టమర్ కేర్ నెంబరు కోసం ఎట్టిపరిస్థితుల్లో గూగుల్ లో వెతకకండి. సంబంధిత అధికారిక వెబ్ సైట్ అప్లికేషన్స్ లోనే ఫిర్యాదుల కోసం నెంబర్ ఉంటుంది.
3. ANY Desk application డౌన్లోడ్ చేసుకోమని ఎవరైనా చెప్పితే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని గ్రహించండి.
4. Instagram, Facebook , Youtube లలో వచ్చే యాడ్ లను చూసి ఎటువంటి వస్తువులు కొనవద్దు మోసపోవద్దు.
5. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు కట్టమంటే కట్టవద్దు.
6. OLX, Quikr, Cardeko వెబ్‌సైట్లలో వస్తువులను డైరెక్టుగా చూడకుండా, అమ్మే వ్యక్తులను డైరెక్టుగా కలవకుండా ముందుగా డబ్బులు కట్టవద్దు.
7. కస్టమర్ కేర్ వాళ్లు చెప్పిన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వేయవద్దు.
8. తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామంటే నమ్మవద్దు. ఏ ఫీజు కట్టవద్దు.
9. ఎవరైనా మెసేజ్/కాల్ చేసి మీకు లోన్ అప్రూవ్ అయిందంటే నమ్మకండి.
10. బహుమతి వచ్చిందంటూ మీకు తెలియని వ్యక్తుల నుంచి మెసేజ్ వస్తే అస్సలు నమ్మవద్దు.
11. రిజిస్ట్రేషన్ లేని లోన్ యాప్ ల నుంచి లోన్ తీసుకోకండి.