Budget Expectations: వాహన రంగానికి కావాలి వరాలు - నిర్మలమ్మ కనికరిస్తే భారీగా తగ్గుతుంది బండి రేటు!
Automobile Sector: వాహన విడిభాగాలపై విధించే GST వర్గీకరణ సంక్లిష్టంగా & తయారీదారులకు అతి పెద్ద అడ్డంకిగా మారింది. దీనిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది.

Budget 2025 Expectations For Automobile Sector: ప్రపంచంలో మూడో అతి పెద్ద మార్కెట్ అయిన భారతదేశ ఆటోమొబైల్ ఇండస్ట్రీ... మారుతున్న వినియోగదారుల అభిరుచులు, ప్రాధాన్యతలు, కంపెనీల లక్ష్యాలు, మారుతున్న ప్రభుత్వ విధానాల నేపథ్యంలో ఒక కీలక మలుపు వద్ద ఉంది. బడ్జెట్ 2025, వాహన రంగానికి బూస్ట్ ఇస్తుందా లేక బ్రేకులు వేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ డే దగ్గరపడే కొద్దీ, ఈ రంగంలోని దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరించాలని, స్థిరమైన వృద్ధికి ఇంధనంగా మారే సంస్కరణలు తీసుకురావాలని ఇండస్ట్రీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. GST శ్లాబ్‌ల సరళీకరణ, దేశీయ తయారీని పెంచడం వంటివి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అత్యంత అత్యవసర అంచనాలలో కొన్ని.
ఎలక్ట్రిక్ & హైబ్రిడ్ వాహనాలకు మారడాన్ని వేగవంతం చేయడం
ప్రభుత్వ సబ్సిడీలు, 5 శాతం తగ్గిన GST రేటు కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల (EVs) అమ్మకాలు వేగంగా పెరిగాయి. అయితే, హైబ్రిడ్ వాహనాలపై ప్రస్తుతం 28 శాతం పన్ను ఉంది, దీనివల్ల ప్రజలను ఇవి అతి తక్కువగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా.. ఛార్జింగ్ పాయింట్ల వంటి EV మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందని ప్రాంతాలలో హైబ్రిడ్ వెహికల్స్‌ను ఆకర్షణీయంగా & తక్కువ ధరకు దొరికేలా చేసేందుకు GST తగ్గించాలని ఇండస్ట్రీ లీడర్స్ కోరుతున్నారు. ఇది, పెట్రో & డీజిల్ వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలకు పరివర్తనను సులభంగా మారుస్తుంది.
పన్నులను సరళీకరణ & రిఫండ్ విధానాలను మెరుగుపరచడం
ఆటో విడిభాగాలపై విధిస్తున్న GST శ్లాబ్‌లు కూడా వాహనాల తయారీదారులకు కొరకరాని కొయ్యగా మారాయి. వీటిని క్రమబద్ధీకరిస్తే విడిభాగాల పరిశ్రమ, వాహనాల పరిశ్రమకు స్పీడ్ బ్రేకర్లు తగ్గుతాయి. అంతేకాదు, వివాదాలు కూడా తగ్గి తయారీ రంగం సామర్థ్యం పెరుగుతుంది. EV తయారీ కంపెనీలు కూడా డ్యూటీ స్ట్రక్చర్ కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం, ఈ సెగ్మెంట్‌లో ఇన్‌పుట్‌లపై తుది ఉత్పత్తి కంటే ఎక్కువ GST రేట్లు ఉన్నాయి.
రిఫండ్ విధానాల క్రమబద్ధీకరణ & క్యాపిటల్ గూడ్స్‌పై ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను (ITC) అనుమతించడం వల్ల నగదు ప్రవాహాన్ని పెంచవచ్చు & ఉత్పత్తి ఖర్చులను తగ్గించవచ్చు. ముఖ్యంగా మూలధన ఆధారిత EV స్టార్టప్‌లకు ఇది చాలా అవసరం.
దేశీయ తయారీని బలోపేతం చేయడం
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకం పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించినప్పటికీ, కఠినంగా ఉన్న విలువ జోడింపు నిబంధనలు & ఆలస్యమవుతున్న చెల్లింపులు అడ్డంకులుగా ఉన్నాయి. నిబంధనలను సడలించడం & చెల్లింపులు సకాలంలో జరిగేలా నిర్ధారించడం వల్ల ఎక్కువ మంది పెట్టుబడిదారులను ప్రోత్సహించవచ్చు. దీనివల్ల, ఉత్పత్తిని పెంచడానికి & కొత్త సాంకేతిక పరిజ్ఞానాల్లో పెట్టుబడి పెట్టడానికి వీలవుతుంది.
EV తయారీ ప్రోత్సాహకాలను విస్తరించడం
ప్రస్తుతం, 35,000 డాలర్లకు పైబడి ధర ఉన్న EVలను దిగుమతి చేసుకుంటేనే కస్టమ్స్ సుంకంలో తగ్గింపును అందిస్తున్నారు. దీనికంటే తక్కువ ధర గల వాహనాలను కూడా ఈ పథకంలో చేరిస్తే మరింత మంది ప్రపంచ తయారీదారులను ఆకర్షించవచ్చు, పోటీని పెంచవచ్చు, ప్రజలకు తక్కువ రేట్లకు EVలను అందించవచ్చు. ఈ విషయంలోనూ ఆర్థిక మంత్రి నుంచి సానుకూల నిర్ణయాన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆశిస్తోంది.
మరో ఆసక్తికర కథనం: హోమ్ లోన్‌పై ప్రత్యేక పన్ను రాయితీ, రూ.5 లక్షల వడ్డీ వరకు 'జీరో టాక్స్'!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

