Weather Updates: ఆగస్టు 5 వరకు భారీ వర్షాలు - అక్కడ పిడుగులు పడతాయని IMD వార్నింగ్
Rains In Telangana: దక్షిణ బంగాళాఖాతం నుంచి వీస్తున్న గాలులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి. మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Rains In Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పలు జిల్లాల్లో ఆగస్టు 5, 6 తేదీల వరకు వర్షాలు కురుస్తూనే ఉంటాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, దక్షిణ బంగాళాఖాతం నుంచి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఏపీ వైపు నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ కేంద్రం ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగి బలహీనపడింది. కొన్ని దక్షిణ కోస్తాంధ్రకు ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు.
తెలంగాణలో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు వర్ష సూచన ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, వికారాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 1, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంపై అధికంగా ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఆగస్టు 5 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, చొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేదు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Impact based forecast for Andhra Pradesh dated 01.08.2022 pic.twitter.com/umPm6qH2nB
— MC Amaravati (@AmaravatiMc) August 1, 2022
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.