Raids In Vivek Houses: 8 కోట్ల రూపాయల చుట్టే విచారణ- మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో తనిఖీలు అందుకేనా?
Telangana News: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు ముగిశాయి . హైదరాబాద్‌లోని సోమాజిగూడతోపాటు చెన్నూరులోనూ ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
ED And IT Raids In Vivek House: మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ (Congress) అభ్యర్థి వివేక్ వెంకటస్వామి (Vivek Ventakaswamy) ఇంట్లో ఈడీ సోదాలు కలకలం రేపాయి. వివేక ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు ఈడీ, ఐటీ అధికారులు. వివేక్‌తోపాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున నుంచి సోదాలు చేశారు.హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, సోమాజిగూడ (Somajiguda)తోపాటు మంచిర్యాల జిల్లా చెన్నూరు (Chennoor)లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కేంద్ర బలగాలతో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు.
ఈనెల 15న.. వివేక్‌కు సంబంధించిన కంపెనీ ఉద్యోగులు చెన్నూరుకు 50 లక్షలు తరలిస్తూ హైదరాబాద్ రామంతాపూర్‌లో పట్టుబడ్డారు. ఇక.. వివేక్‌కు సంబంధించిన కంపెనీ నుంచి 8కోట్ల రూపాయల నగదు బదిలీపై కూడా కేసు నమోదు చేసిన ఈడీ.. తనిఖీలు చేపడుతోంది. ఆన్‌లైన్ లావాదేవీలు భారీగా జరిగినట్టు గుర్తించింది. హైదరాబాద్‌లో 8కోట్ల రూపాయలను ఆర్‌టీజీఎస్ (RTGS) ద్వారా బదిలీ చేసినట్టు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. బీఆర్‌ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులు... విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్... బేగంపేట్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంకు ఖాతా నుంచి ట్రాన్స్‌ఫర్ చేసిన 8కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు సైఫాబాద్ పోలీసులు. దీనికి సంబంధించి ఈడీ, ఐటీ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఇవాళ తెల్లవారుజాము నుంచి వివేక్ ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
ఈ నెల 13న ఉదయం 10గంటల 57నిమిషాలకు బేగంపేటలోని హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్రాంచ్‌లో ఉన్న విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఒక ఖాతా నుంచి.... బషీర్‌బాగ్‌లోని ఐడీబీఐ బ్యాంకుశాఖలోని విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలోకి 8 కోట్ల రూపాయల నగదు బదిలీ అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి సోదాలు జరిగాయి.
వివేక్ వెంకస్వామి ఇళ్లు, ఆఫీసులపై ఈడీ, ఐటీ దాడులను ఆయన అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. చెన్నూలులోని వివేక్ ఇంటి దగ్గరకు భారీగా చేరుకున్న కార్యకర్తలు, అనుచరులు ఆందోళన చేస్తున్నారు. ఇందంతా రాజకీయ కుట్ర అని... ఇందులో బీఆర్‌ఎస్ హస్తం ఉందని వివేక అనుచరులను ఆరోపిస్తున్నారు. ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు వివేక్. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక... ఈడీ, ఐటీ దాడుల్లో ఏమేమీ స్వాధీనం చేసుకున్నారు అన్నది తేలాల్సి ఉంది.
వివేక్ వెంకటస్వామి సూటు బూటు సూట్‌కేసులతో వచ్చి ఇతర పార్టీ నేతలను కొనుగోలు చేస్తున్నారని బీజేపీ నేత బాల్కసుమన్ ఆరోపించారు. అంతేకాదు ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. వివేక్ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు డబ్బులతో పట్టుబడటం కూడా కలకలం రేపింది. దీంతో ఈడీ, ఐటీ శాఖలకు సమాచారం ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగి రైడ్స్ చేస్తున్నట్టు సమాచారం.