Priyanka Gandhi: కేసీఆర్, కేటీఆర్‌కు ఉద్యోగాలిస్తే యువతకు రావు - ఆసిఫాబాద్ సభలో ప్రియాంక
Priyanka Gandhi in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలోని ఖానాపూర్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరు అయి ప్రసంగించారు.
Telangana Elections 2023: తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్‌లకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) రాష్ట్ర ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణను అధికారంలోకి తీసుకొని వస్తే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు ఏనాడూ న్యాయం జరగలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తానని కూడా వారికి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ (Telangna Congress) పార్టీ నిర్వహించిన విజయభేరి బహిరంగ సభకు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) హాజరు అయి ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, కర్ణాటకలో అమలు చేస్తున్న తరహాలో తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
గత పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను లూఠీ చేశాడని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ కు ఉద్యోగాలు ఇస్తే యువతకు ఉద్యోగాలు రాబోవని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌ను పక్కాగా అమలు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించినట్లుగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షలలోపు ఉన్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, వరికి బోనస్ ధర కూడా చెల్లిస్తామని చెప్పారు. ధరణి పోర్టల్ లో చాలా తప్పులు ఉన్నందున, దాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో మంచి సాంకేతికతను తెస్తామని హామీ ఇచ్చారు.
కార్పొరేట్ కంపెనీలతోనే బీజేపీ ఫ్రెండ్ షిప్
అటు కేంద్రంలోని బీజేపీ పెద్ద కార్పొరేటు కంపెనీలతో ఫ్రెండ్ షిప్ చేస్తూ దేశాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. మోదీ సర్కార్ కార్పొరేట్లకు రుణమాఫీ చేస్తుంది తప్ప రైతుల గురించి పట్టించుకోబోదని విమర్శించారు. కాంగ్రెస్ సహా విపక్ష నేతలే లక్ష్యంగా ఈడీ, సీబీఐలతో మోదీ దాడులు చేయిస్తారని అన్నారు. 10 సంవత్సరాల నుంచి తెలంగాణను కేసీఆర్ నాశనం చేస్తున్నారని.. మోదీ తెలంగాణకు వచ్చి కాళేశ్వరం గురించి నోరు ఎత్తలేదని చెప్పారు. ఎందుకంటే వారు ఇద్దరు ఒక్కటేనని ప్రియాంక ఆరోపించారు. బీజేపీ - బీఆర్‌ఎస్ - ఎంఐఎం మూడు పక్కపక్కనే ఉండి డ్రామాలు చేస్తూ ఉంటాయని అన్నారు.
ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి పోటీ చేస్తుంటే తెలంగాణలో మాత్రం కేవలం 9 స్థానాల్లోనే ఎందుకు పోటీ చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై కాంగ్రెస్‌కు ఒక విజన్ ఉందని ప్రియాంక అన్నారు.
గిరిజనులకు ఇందిర ఎంతో చేశారు - ప్రియాంక
ఇందిరాగాంధీ గిరిజనులు, ఆదివాసీల కోసం ఎంతో చేశారని గుర్తు చేశారు. ఆమె చనిపోయి 40 ఏళ్లు అయినా ప్రజలు ఇంకా ఆరాధిస్తూనే ఉన్నారని అన్నారు. జల్, జంగల్, జమీన్ సంస్కృతి ఆదివాసీలదని.. అది ప్రపంచంలోనే అత్యున్నత సంస్కృతి అని చెప్పారు. ఇందిరాగాంధీ హయాంలో గిరిజనులు, ఆదివాసీల హక్కులకు రక్షణ కల్పించే చట్టాలు చేశారని ప్రియాంక గుర్తు చేశారు.