KTR Arrest News: కేటీఆర్ అరెస్టుపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది - పొంగులేటి వ్యాఖ్యలు - హింట్ ఇచ్చినట్లేనా ?
Ponguleti : ఈ కార్ రేస్ స్కామ్‌లో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి వచ్చిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఏసీబీకి ఆ అనుమతిని సీఎస్ మంగళవారం పంపిస్తారన్నారు.
Telangana Cabinet: ఫార్ములా ఈ రేస్ కార్ల వ్యవహారంలో రూ. 50 కోట్ల గోల్ మాల్ ఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదుకు గవర్నర్ అనుమతి మంజూరు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కేబినెట్ సమావేశంలో ఈ కార్ రేసు పేరుతో జరిగిన దోపిడీపై చర్చ జరిగిందని మంత్రి పొంగులేటి చెప్పారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ గవర్నర్ ఇచ్చిన అనుమతిని ఏసీబీకి పంపుతారని అన్నారు. ఈ కేసు విషయంలో కేటీఆర్ ను అరెస్టు చేస్తారా లేదా అన్నది తానేమీ చెప్పలేనని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో ఈ కార్ రేసుల నిర్వహణ
బీఆర్ఎస్ హయాంలో ఈ కార్ రేసులు నిర్వహించారు. రెండో ఏడాది నిర్వహించడానికి ఒప్పందం చేసుకున్నారు. అయితే స్పాన్సర్లు వెనక్కి తగ్గడంతో ఆ మొత్తం తామే కడతామని అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది. ఏర్పాట్ల కోసం ముందస్తుగా రూ. యాభై కోట్లు ఈ కార్ రేసులు నిర్వహించే సంస్థకు బదిలీ చేశారు. అయితే ఎలాంటి పత్రాలు, అనుమతులు లేవు. కేబినెట్ ఆమోదం కూడా తీసుకోలేదు. ఈ లోపు ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తరలించాలంటే ఖచ్చితంగా అన్ని రకాల అనుమతులు ఉండాలి. కానీ కేటీఆర్ నోటి మాట ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు ఐఏఎస్ అర్వింద్ కుమార్ ఈ డబ్బులను తరలించేశారు. ఆ ఈ కార్ రేస్ సంస్థ విదేశీ సంస్థ కావడంతో ఆ నిధులన్నీ విదేశాలకు వెళ్లిపోయాయి.
Also Read: ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కారిడార్ ప్రతిపాదన విరమించుకోవాలి - ఎమ్మెల్యే హరీష్ బాబు
నోటి మాట ద్వారానే ఖజానా నుంచి డబ్బుల తరలింపు
ప్రభుత్వం మారగానే ఈ డబ్బుల తరలింపుపై ప్రాథమికంగా విచారణ జరిపారు. ఐఏఎస్ అర్వింద్ కుమార్ తాను కేటీఆర్ ఆదేశాలతోనే డబ్బులు పంపించామని రిపోర్టు ఇచ్చారు. తాజాగా కేబినెట్ లో జరిగిన చర్చలు అధికారికంగా ఐఏఎస్ అర్వింద్ కుమార్ పై విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. గవర్నర్ అనుమతి ఆలస్యం కావడంతో ఇప్పటి వరకూ పెండింగ్ లో పడింది. తాజాగా గవర్నర్ అనుమతి రావడంతో కేబినెట్ లో చర్చించారు. సీఎస్ ద్వారా ఏసీబీకి పంపాలని నిర్ణయించుకున్నారు.
కేటీఆర్ ను వెంటనే అరెస్టు చేసే అవకాశాలు తక్కువే
ఈ స్కాం విషయంలో కేటీఆర్ పై చర్యలు తీసుకోవడం ఖాయమే కానీ ఉన్న పళంగా ఆయనను అరెస్టు చేసే అవకాశాలు లేవని భావిస్తున్నారు. మొదట ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేస్తారని ప్రశ్నించిన తర్వాత సహకరించకపోతే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు అనిపించుకోకుండా.. చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.