Pink Eye Conjunctivitis: కండ్లకలకకు భయం వద్దు, జాగ్రత్తలు తీసుకుంటే చాలు: మంత్రి హరీష్ రావు
Pink Eye Conjunctivitis: కండ్లకలకకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని మంత్రి హరీష్ రాపు సూచించారు.
Pink Eye Conjunctivitis: కండ్లకలకకు ప్రజలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. అలాగే దీని వల్ల పెద్ద ప్రమాదం కూడా ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు. కండ్లకలక వస్తే.. కళ్లు తెల్లని పదార్థాన్ని స్రవిస్తాయని, కంటి నుంచి నీరు కారుతూనే ఉంటుందని చెప్పారు. అలాగే కంటి రెప్పలు ఉబ్బిపోయే అవకాశం ఉందని.. ఇది ఒక కంటికి వచ్చి రెండో కంటికి కూడా సోకుతుందని చెప్పారు. చికిత్సలో వినియోగించే కంటి చుక్కలు, ఆయింట్ మెంట్ లు అవసరమైన మందులను పీహెచ్సీ, బస్తీ దవాఖాన, పల్లె దవాఖానల స్థాయి నుంచి అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండేలా చూస్తున్నామని వివరించారు. కొన్ని జిల్లాల్లో కండ్లకలక కేసులు నమోదు అవుతున్న క్రమంలో మంత్రి హరీష్ రావు మంగళవారం రోజ వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సూపరింటెండెంట్లు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్యాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కండ్లకలక, సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి మంత్రి అధికారులకు వివరించారు. ఈ సందర్భంగానే మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కండ్లకలక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి నివారణ చర్యలు, చికిత్స తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇన్ఫెక్షన్ సోకిన వారిని ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు గుర్తించి సమీప దవాఖానల్లో చికిత్స అందేలా చూడాలని సూచించారు. గురుకులాలు, హాస్టళ్లలో పరిశుభ్రత గురంచి అవగాహన పెంచాలని చెప్పారు.
క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత అవసరం
కండ్లకలక బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటే సబ్బుతో చేతులను క్రమం తప్పకుండా కడుక్కోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. మీ చేతులతో కళ్లను పదేపదే తాకకూడదని వివరించారు. కళ్లను రుద్దడం వంటివి చేయకూడదన్నారు. దుమ్ము, ధూళి కళ్లల్లో పడకుండా చూసుకోవాలని చెప్పారు. వానా కాలంలో బయటికి వెళ్తున్నట్లయితే కంటికి గ్లాసెస్ పెట్టుకోవడం ముఖ్యం అని అన్నారు. నివాస స్థలం కూడా శుభ్రంగా దుమ్ము దూళీ లేకుండా ఉండేలా చూసుకోవాలని.. పరుపులు, కార్పెట్లు అనేవి తరుచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలని వివరించారు. అలాగే ఒకరు వాడిన వస్తువులు(కర్చీఫ్లు, దిండులు, బెడ్ షీట్లు, టవల్స్) మరొకరు వాడడం మంచిది కాదని మంత్రి హరీష్ రావు సూచించారు. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కండ్లకలకను అడ్డుకోవచ్చని వివరించారు. అలాగే వానాకాలంలో గాలిలో ఫంగస్, ఇతర అలర్జీ కారకాలు పుష్కలంగా ఉంటాయని... ఇవి కళ్లను తాకినప్పుడు కండ్ల కలక వస్తుందని చెప్పారు.
ఆరోగ్య మహిళ క్లినిక్స్ పని తీరును మానిటరింగ్ చేయాలి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ వేళలు పెంచాలని సూపరింటెండెంట్ ను అదేశించారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు కొనసాగించాలని చెప్పారు. ప్రభుత్వం సరఫరా చేసిన ఎయిర్ ఫిల్టర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్య మహిళ క్లినిక్స్ పని తీరును డీఎంహెచ్ఓ, ప్రోగ్రాం ఆఫీసర్లు మానిటరింగ్ చేయాలని తెలిపారు. అలాగే అఖ్కడ అందుతున్న వైద్య సేవల గురించి మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు.