(Source: ECI/ABP News/ABP Majha)
Bandi Sanjay letter To KCR: ఉత్తర కుమారుని ప్రగల్భాలు ఆపి, వడ్ల కొనుగోళ్ల కేంద్రాలను వెంటనే ప్రారంభించండి: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
Bandi Sanjay open letter to CM KCR: మీరు ప్రతి గింజా కొంటామని ప్రకటించి 15 రోజులు కావస్తోందని, అయినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని సీఎం కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు.
Paddy Procurement In Telangana: వడ్ల కొనుగోళ్ల కేంద్రాలను, కాంటాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. బీజేపీ తెలంగాణ నేతలు చేసిన అనేక ఉద్యమాలకు తలవొగ్గే మీరు వడ్లు కొనడానికి ముందుకు వచ్చారు, అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రతీ వడ్ల గింజ కొంటామని ప్రకటన చేశారు.. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే మీ ప్రకటన కేవలం ఉత్తర కుమారుని ప్రగల్భాలేనని స్పష్టం అవుతోందన్నారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం మీరు ప్రతి గింజా కొంటామని ప్రకటించి 15 రోజులు కావస్తోందని, అయినా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.
ఇప్పటికైనా మీరు కళ్లకు కట్టుకున్న గంతలు తీసేసి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషిచేయాలని బీజేపీ తెలంగాణ శాఖ తరుపున విజ్ఞప్తి చేస్తున్నానని బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న తన వద్దకు పలువురు రైతులు వచ్చి కొనుగోళ్ళ కేంద్రాలు ప్రారంభించలేదని, దీనివల్ల వారు పడుతున్న ఇబ్బందులను తన దృష్టికి తీసుకొని వచ్చారని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల్ లో 71 కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభించాల్సి వుండగా కేవలం రెండు కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. అదేవిధంగా వనపర్తిలో 225 కేంద్రాలకు 19 కేంద్రాలు, నారాయణపేట్‌లో 91 కేంద్రాలకు 70 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కాంటా పెడుతున్నది మాత్రం నామామాత్రమేనని బండి సంజయ్ తెలిపారు.
7 వేలకు బదులుగా 2500 కేంద్రాలే..
తెలంగాణ వ్యాప్తంగా 7 వేల కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా కేవలం 2,500 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. రాష్ట్రప్రభుత్వం 60 లక్షల టన్నులు ధాన్యం కొనాల్సి వుండగా కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటివరకు కొన్నది. దీన్ని బట్టే రాష్ట్రప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ, చిత్తశుద్ధి ఉన్నదో స్పష్టం అవుతున్నదని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించటమే కాకుండా ప్రతీ ఒక్క కొనుగోలు కేంద్రాల్లో కాంటా ఏర్పాటుచేసి ప్రతీ ఒక్క గింజ కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్రశాఖ తరుపున డిమాండ్ చేశారు.
కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే నష్టమే
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కాంటాలు ఏర్పాటు చేయకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. రైతులు వడ్లను తీసుకొని కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వాటిని కొనుగోలు చేయకపోవడంవల్ల వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను, కాంటాలను ఏర్పాటుచేసి రైతులను ఆదుకోవాలని రైతులకు అవసరమైనంత గోనుసంచులను సేకరించాలని, రైతుల నుంచి సేకరించిన వడ్లకు వెంటనే చెల్లింపులు చేయాలని, అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనాలని బీజేపీ తెలంగాణ శాఖ తరఫున బండి సంజయ్ తన లేఖలో డిమాండ్ చేశారు.
అలసత్వం ప్రదర్శించవద్దు..
ధాన్యం కొనుగోలుకయ్యే ప్రతి పైసా ఖర్చును కేంద్రప్రభుత్వమే చెల్లిస్తున్నందున రాష్ట్రప్రభుత్వం ఎటువంటి అలసత్వాన్ని చూపించకుండా ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిదికన చర్యలు చేపట్టాలి. రాష్ట్రప్రభుత్వం సేకరించిన వడ్లను బియ్యంగా మార్చి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే పూర్తిగా తీసుకోవడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రప్రభుత్వం వెంటనే ఆలస్యం చేయకుండా కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొస్తున్న ప్రతీ ఒక్క వడ్ల గింజను కొనుగోలు చేయాలని రైతులపక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రప్రభుత్వం ప్రతీ గింజ కొనేవరకు, వారికి చెల్లించాల్సిన సొమ్ములను చెల్లించే వరకు రైతులు పక్షాన బీజేపీ తెలంగాణ శాఖ పోరాడుతుందని’ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.