huzurabad bypoll: ఈటలపై దాడికి కుట్ర..! హుజూరాబాద్ ఉపఎన్నిక దారి తప్పుతోందా..!?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఓ మంత్రి దాడి చేసేందుకు ప్రయత్నించారా? హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడిలో అలాంటి పని చేసే వీలుందా? ఈటల చేసిన ఆరోపణల వెనక ఉన్న అర్థం ఏంటి?
తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇంకా రాకుండానే.. హైవోల్టెజ్ టెంపర్‌మెంట్ సృష్టిస్తోంది. ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలతో హోరెత్తిపోతోంది. ఈ క్రమంలో... ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తనపై దాడి చేసేందుకు రాష్ట్ర మంత్రి ఒకరు.. మాజీ మావోయిస్టుతో సుపారీ కుదుర్చుకున్నారని ఈటల ఆరోపించారు. ఈటల ఆరోపణలు.. సహజంగానే కలకలం రేపాయి. ఎందుకంటే.. రాజకీయ వైరుధ్యాలే కానీ.. శత్రుత్వాలు.. దాడులు చేసుకోవడం.. హత్యలు చేసుకోవడం వంటి సంస్కృతి తెలంగాణలో దాదాపుగా లేదు. ఇలాంటి సందర్భంలో.. ఈటల తనపై దాడికి ప్లాన్ చేశారని ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పడం సంచలనం సృష్టించకుండా ఎలా ఉంటుంది?
అయితే ఈటల ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. కానీ వెంటనే.. మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఎందుకంటే.. హుజూరాబాద్ నియోజకవర్గ బాధ్యతను ఆయనే తీసుకున్నారు. దాంతో ఈటల చెప్పిన మంత్రి తానే అని అనుకున్న ఆయన వెంటనే.. స్పందించి ప్రెస్‌మీట్ పెట్టారు. ఓ రకంగా వివరణ ఇచ్చినట్లుగా మాట్లాడారు. ఈటల ఆరోపణలు అవాస్తవమని.. కావాలంటే సీబీఐతో అయినా విచారణ చేయించుకోవాలని సూచించారు. అంతే కాదు.. ఈటలతో తనకు వ్యక్తిగత కక్ష లేదని స్పష్టం చేశారు. సానుభూతి కోసమే.. ఈటల డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఈటల ఆరోపణలు చేయడం.. గంగుల స్పందించడంతో రాజకీయం ముదిరి పాకాన పడినట్లయింది.
మరో వైపు హూజూరాబాద్‌లో ఎలాగైనా గెలిచి తీరాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హుజూరాబాద్‌లో ఉన్న దళిత కుటుంబాలన్నింటికీ.. రూ.పది లక్షలు పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలాగే.. పదిహేను వేల వరకు కొత్త పెన్షన్షు మంజూరు చేస్తున్నారు. రేషన్ కార్డులు ఇస్తున్నారు. మొత్తంగా.. ఎన్నిక ప్రారంభమయ్యేలోపు.. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరపున ప్రయోజనం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం మొత్తం అక్కడే మకాం వేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నోటిఫికేషన్ రాక ముందే.. కీలకమైన అధికారులందర్నీ బదిలీ చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు నమ్మిన బంటుల్లా ఉండే అధికారుల్ని తీసుకొచ్చి నియమిస్తున్నారు. ఇప్పటి వరకూ అక్కడ.. ఈటల చెప్పిన అధికారుల్నే నియమించేవారు. అందుకే అక్కడ వారిని ఉంచకుండా బదిలీ చేసేస్తున్నారు.
హుజూరాబాద్‌లో గెలుపు కోసం.. అటు టీఆర్ఎస్.. ఇటు ఈటల పూర్తి స్థాయిలో శక్తియుక్తులు కేంద్రీకరిస్తున్నారు. టీఆర్ఎస్‌కు అదనంగా అధికార బలం ఉంది. బీజేపీకి కూడా ఉన్నా.. అది కేంద్రంలో కావడంతో.. ఇక్కడ యంత్రాంగంపై ప్రభావం చూపలేని పరిస్థితి ఉంది. ముందు ముందు హూజూరాబాద్ వార్ మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.