TRS Leader Dasara : అన్ని దానాల్లోకెల్లా లిక్కర్ దానం గొప్ప అనుకుంటాడు ఆ టీఆర్ఎస్ లీడర్ - కేసీఆర్, కేటీఆర్ కటౌట్ల సాక్షిగా ...
దసరా పండగ సందర్భంగా మద్యం , కోళ్లను పేదలకు పంపిణీ చేశారు టీఆర్ఎస్ లీడర్. కేసీఆర్ ప్రధాని, కేటీఆర్ సీఎం కావాలని పంపిణీకి ముందుగా పూజలు చేశారు.
TRS Leader Dasara : ఎండా కాలం ఐస్ క్రీం ఎవడైనా తింటాడు చలికాలంలో ఐస్‌క్రీం తినేవాడికే ఓ రేంజ్ ఉంటది .. అని సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ చూసి ఇన్‌స్పయిర్ అయ్యాడో లేకపోతే.. పండగ పూట పేదల కష్టాలు నిజంగా తెలుసని ఫీలయ్యాడో కానీ ఆ టీఆర్ఎస్ లీడర్ భిన్నంగా ఆలోచించాడు. పేదలకు అందరూ ఎప్పుడూ పప్పులు, ఉప్పులు , బియ్యం లాంటివి పంపిణీ చేస్తూంటారు. తానూ అదే ఇస్తే ప్రత్యేకత ఏముంటుందని అనుకున్నాడు. అదే సమయంలో పండగ సమయంలో వారికి ఏమి ఉపయోగపడతాయో అని ఆలోచించారు. వెంటనే అతడికి తట్టింది మద్యం, మాంసం. ఆ రెండు పేదలకు పంపిణీ చేస్తే పోలా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగిపోయాడు.
రెండు వందల మందికి కోళ్లు, క్వార్టర్ మద్యం బాటిల్ పంపిణీ
ఓ రెండు వందల కోళ్లు.. రెండు వందల క్వార్టర్ బాటిళ్లను కొనుగోలు చేశాడు. రెండు వందల మంది హమాలీలను గుర్తించి.. పంపిణీ సమయానికి ఫలానా చోటుకు వచ్చేయమన్నాడు. ఆ సమయం కల్లా మంచి సెటప్ ఏర్పాటు చేశాడు. కేసీఆర్, కేటీఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు. అంటే వారి సాక్షిగా పంపిణీ చేస్తారన్నమాట. చెప్పినట్లుగానే రెండు వందల మందికి కోడి, మద్యం బాటిల్ పంపిణీ చేశారు. ఊరకనే పంపరు కదా.. బాటిళ్లు తీసుకున్న వారందరితో కలిసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశ వ్యాప్తంగా జాతీయ పార్టీ పెట్టబోతున్న సందర్భంగా జాతీయ పార్టీకి వారే అధ్యక్షునిగా ఎంపిక కావాలని అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సభ్యులు విజయం సాధించి.. ప్రధానమంత్రి కేసీఆర్ కావాలని.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుని గా కల్వకుంట్ల తారకరామారావు ఎంపికై రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని విజయదశమి కేసీఆర్ కుటుంబానికి విజయాలను సాధించి పెట్టాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేసీఆర్ ప్రధాని , కేటీఆర్ సీఎం కావాలని పంపిణీకి ముందుపూజలు
ఈ టీఆర్ఎస్ లీడర్ పేరు రాజనాల శ్రీహరి. రాజనాల అంటే మనకు అలనాటి సినిమాల్లో విలన్ గుర్తుకు వస్తారు. కర్తవ్యం సినిమాలో నీ జీవితంపై నాకు విరక్తి పుట్టిందని చెప్పే డైలాగ్ మాదిరి.. ఈయన రాజకీయం .. చేసిన మద్యం పంపిణీ.. దానికి కేసీఆర్ జాతీయ పార్టీకి లింక్ పెట్టడం వంటివి చూస్తే.. నాకు రాజకీయాలపై విరక్తి పుట్టిందని ఇతరులు అనుకుంటే తప్పేం లేదు. తనను తాను రాష్ట్ర నాయకుడిగా చెప్పుకుని హైకమాండ్ దృష్టిలో పడటానికి రాజనాల శ్రీహరి తన బడ్జెట్‌లో ఇలాంటి పనులు తరచూ చేస్తూంటారు. అందుకే రాష్ట్ర నాయకుడు అనే ట్యాగ్ కూడా తగిలించుకున్నారు. అయితే ఇలాంటి పనులు చేసినప్పుడు మాత్రమే ఆయనకు పబ్లిసిటీ వస్తుంది. తర్వాత పట్టించుకోరు.
కేసీఆర్, కేటీఆర్ కటౌట్ల సాక్షిగా పంపిణీ
ఏమని పూజలు చేస్తే ఏమయింది కానీ పండగకు కోడి, మద్యం బాటిల్ వచ్చినందుకు ఆ ఖర్చులు మిగిలిపోయాయని హమాలీలు మాత్రం కాస్త సంతోషించారు. ఈ సారి ఎప్పుడైనా ఇలాంటి వితరణ పెడితే తప్పకుండా తమను పిలవాలని కూడా విన్నవించుకున్నారు.