NTR Centenary Celebrations Live Updates: ఎన్టీఆర్ కు కచ్చితంగా భారతరత్న ఇవ్వాల్సిందే - నారాయణమూర్తి
NTR Centenary Celebrations Live updates: ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ’ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని కైతలాపూర్ లో వేడుకలు మొదలయ్యాయి.
LIVE
Background
NTR Centenary Celebrations Live updates:
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత నేత ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ’ మే 20న సాయంత్రం 5గంటలకు హైదరాబాద్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని కైతలాపూర్ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడుకలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ప్రముఖ సినీ నటడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
ఈ వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ సమగ్ర సినీ, రాజకీయ జీవితంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహచర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, పాత్రికేయులు, సహచర రాజకీయ నాయకులు, వివిధ పార్టీల నేతలు, ఎడిటర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను సంకలనం చేసిన ‘శక పురుషుడు’ ప్రత్యేక సావనీర్‌ను, అదేవిధంగా ఎన్టీఆర్ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్’ వెబ్‌సైట్ ఆవిష్కరించనున్నారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు. ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలును గుర్తు చేసుకుందాం. ఎన్టీఆర్ లో దేవుడి రూపంలో చూశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ... ప్రాంతాలు వేరైనా తెలుగు ప్రజలందరూ ఒక్కటే. ఎన్టీర్ శతజయంతి ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులే. ఎన్టీఆర్ అందరివాడు. ప్రాంతాలకు అతీతంగా ఎన్టీఆర్ కు అందరూ అభిమానులే. నటుడిగా ఉంటూనే ప్రజలకు ఎంతో సేవ చేశారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం అన్నారు ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్. సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేరు నిలిచి ఉంటుంది. ఎన్టీఆర్ చరిత్ర గురించి ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించాం. 500 పేజీల ప్రత్యేక సావనీర్ ఆవిష్కరించనున్నాం అన్నారు. ఎన్టీఆర్ పేరుతో ప్రత్యేక యాప్ ను లోకేష్ ఆవిష్కరిస్తారని తెలిపారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించనున్నాం. టిడిపి ప్రముఖులను సత్కరించనున్నామని చెప్పారు.
కాగా, ఈ వేడుకలలో ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు. ‘గెస్ట్స్ ఆఫ్ ఆనర్’గా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ సెక్రటరీ సీతారామ్ ఏచూరి, బీజేపీ జాతీయ నేత పురందీశ్వరి, టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, కన్నడ చిత్ర హీరో శివకుమార్ హాజరుకానున్నారు. టాలీవుడ్ నుంచి ప్రముఖ హీరోలు చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్ వ్యక్తిగత కారణాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఈ కార్యక్రమాకి హాజరు కావడం లేదని సమాచారం.
ప్రముఖ తెలుగు హీరోలు దగ్గుబాటి వెంకటేష్, సుమన్, మురళీమోహన్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, నందమూరి కళ్యాణ్‌రామ్, ప్రముఖ హీరోయిన్, మాజీ పార్లమెంట్ సభ్యులు జయప్రద, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు జి. ఆదిశేషగిరి రావు, సి. అశ్వనీదత్, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో పాల్గొంటారని సమాచారం. ఈ కార్యక్రమంలో సావనీర్, వెబ్‌సైట్‌ల ఆవిష్కరణలతోపాట పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పలువురు ప్రముఖులకు కమిటి పురస్కారాలు అందిస్తుంది.
NTR Centenary Celebrations: ఏ నేతకు సాధ్యంకాని పథకాలు ప్రవేశపెట్టారు ఎన్టీఆర్ - బాలకృష్ణ
తన తండ్రి ఎన్టీఆర్ కారణజన్ముడు, తనకు గురువు, దైవం అన్నారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. అందర్నీ మహానుభావులు అనరు. అలా అనిపించుకోవాలంటే మహోన్నత భావాలు ఉండాలి, మహోన్నత ఆచరణ చేసిన వాళ్లే మహానుభావులు అవుతారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిల్చున్న వ్యక్తి ఎన్టీఆర్. ఏ నేతకు సాధ్యంకాని పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. ఎన్నో గొప్ప పాత్రలు ఆయన పోషించారని గుర్తుచేశారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా జీవించారని తన తండ్రి ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు.
ఎన్టీఆర్ అందరికీ ఆదర్శం. వందేళ్ల కిందట ఓ వెలుగు వెలిగింది. ఆ వెలుగు మరో వెయ్యేళ్లకు సరిపడ కాంతినిచ్చింది. ఆయన పేరు తలుచుకుంటే తెలుగు జాతి ఒళ్లు పులకరిస్తుంది. ఇతను మా వాడు అని తెలుగు ప్రజలు చెప్పుకునే మనిషి ఎన్టీఆర్. తన జన్మను తెలుగుజాతికి ఓ బ్రహ్మోత్సవంలా మార్చేశారు. తెలుగోడు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా గుర్తొచ్చేది ఎన్టీఆర్. ఆయన నుంచి ఎంతో మంది స్ఫూర్తి పొందుతారన్నారు. నటనకు నిర్వచనం, నవరసాలకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నూతన శకానికి నాంది.
రాజకీయాల్లో క్రమశిక్షణ తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ - బండారు దత్తాత్రేయ
రాజకీయాల్లోకి వచ్చినా ఎంతో సాధారణంగా జీవించిన వ్యక్తి ఎన్టీఆర్ అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రాజకీయాల్లో క్రమ శిక్షణ తీసుకొచ్చారు. దక్షిణాది అంటే మద్రాసి అనే వాళ్లు. కానీ తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా ఎన్టీఆర్ చేశారన్నారు. రాజకీయాల్లో స్నేహభావం ఉండేలా ఆయన ప్రవర్తించారని ఎన్టీఆర్ తీరును గుర్తుచేశారు.
ఎన్టీఆర్ కు కచ్చితంగా భారతరత్న ఇవ్వాల్సిందే - నారాయణమూర్తి
కాలానికి ఎదురీదిన ధీరోదాత్తుడు, సమస్యలను పరిష్కరించగల చాణక్యుడు ఎన్టీఆర్ అని నటుడు నారాయణమూర్తి అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామారావు గారిన వేసిన వేషాలు వేస్తూ ఆయన వారసత్వాన్ని బాలక్రిష్ణ ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. శివాజీ గణేషన్, రాజ్ కుమార్, ఎస్వీఆర్, ఏఎన్నార్ లాంటి గొప్ప నటులున్నా ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కావడానికి కారణం ఆయన అన్ని రకాల పాత్రలు పోషించి మెప్పించారు. 9 నెలల కాలంలో పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతం అన్నారు.
సీఎం అయినా ఎన్టీఆర్ సామాన్యుడిలా ఉండేవారు - కన్నడ నటుడు శివ రాజ్ కుమార్
ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమానికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు కన్నడ ప్రముఖ నటుడు శివ రాజ్ కుమార్. కోడంబాకమ్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ను చూసేందుకు చాలా మంది వచ్చి ఆయన ఇంటి ముందు నిల్చునే వాళ్లు. ఎన్టీఆర్, ఏఎన్నార్, రాజ్ కుమార్, శివాజీ గణేషణ్ దిగ్గజ నటులు. ముఖ్యమంత్రి అయినా ఎన్టీఆర్ సామాన్యుడిలా ఉండేవారు. బాలయ్యతో కలిసి త్వరలో ఒక సినిమా చేయబోతున్నా అని చెప్పారు శివ రాజ్ కుమార్.
నా లైఫ్ లో ఒక్కసారి ఎన్టీఆర్ ను కలిశాను, చాలా గర్వంగా ఉంది: రామ్ చరణ్
ఎంతో ఉన్నత స్థాయి ఉన్న నటుడు, వ్యక్తి ఎన్టీఆర్ గురించి మాట్లాడే స్థాయి నాది కాదన్నారు నటుడు రామ్ చరణ్. పెద్దవాళ్లు వేసిన దారిలో నడుస్తూ వెళ్దామన్నారు. తోటి నటీనటులు, సినిమాకు చెందిన వారు ఎన్టీఆర్ పేరు గుర్తుకుతెచ్చుకుంటారు. ఇతర రాష్ట్రాలకు సైతం ఆయన తెలుగు సినిమాను తెలిసేలా చేశారు. ఎన్టీఆర్ ను ఒకే ఒక్కసారి కలిశాను. పురంధేశ్వరిగారి అబ్బాయి, నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో స్కేటింగ్ చేస్తూ వెళ్లి ఆయనను కలిశాను. సీఎం కదా, సెక్యూరిటీ ఉంటుంది అనుకున్నాను. ఆయనను వెళ్లి చూసి ఆశ్చర్యపోయాను. ఆయన ఫ్రెషప్ అయి టిఫిన్ చేస్తున్నారు. నాకు కూడా ఎంతో ప్రేమగా ఫుడ్ పెట్టారు. ఇప్పుడు తెలుగు సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. అప్పట్లోనే ఎన్టీఆర్ తెలుగు సినిమాకి ఖ్యాతి తీసుకొచ్చారు. చంద్రబాబు, బాలయ్య బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు రామ్ చరణ్.